కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంస్థల నుంచి కేటాయించిన స్థలాల్లో ఐదేళ్లలోపు ఇల్లు నిర్మించని వారి ప్లాట్లను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. ఇందుకు బదులుగా స్థలాల కోసం చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని తెలిపారు.
బెంగళూరులోని హెబ్బాళ్ జంక్షన్లో నిర్వహించిన ‘వ్యర్థాల రహిత స్వాతంత్ర్యం’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం డీకే శివకుమార్ ఈ ప్రకటన చేశారు. బెంగళూరు అభివృద్ధి ప్రాధికార సంస్థ, పూర్వపు నగర అభివృద్ధి ట్రస్ట్ బోర్డు, స్థానిక సంస్థలు, సహకార సంఘాల ద్వారా కేటాయించిన స్థలాలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.
చాలా మంది స్థలాలు కొనుగోలు చేసి 20, 30, 40 సంవత్సరాలు గడిచినా ఇళ్లు నిర్మించకుండా ఖాళీగా ఉంచుతున్నారని సీఎం అన్నారు. పెట్టుబడి కోసం మాత్రమే స్థలాలు కొనుగోలు చేసి వాటిని ఖాళీగా వదిలేస్తే ప్రభుత్వం బాధ్యత వహించదని స్పష్టం చేశారు. అలాంటి ఖాళీ స్థలాలు చెత్త డంపింగ్ కేంద్రాలుగా మారుతున్నాయని, వాటిని సంరక్షించడం యజమానుల బాధ్యత అని తెలిపారు.
ఇల్లు నిర్మించేందుకు బ్యాంకు రుణాలు అందుబాటులో ఉన్నాయని, చిన్నదైనా పెద్దదైనా నివాస గృహాన్ని నిర్మించాలని సూచించారు. కనీసం ప్రహరీ గోడ కూడా నిర్మించకుండా స్థలాలను నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు.
ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను ఆగస్టు 15లోపు శుభ్రం చేయాలని సీఎం ఆదేశించారు. లేనిపక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై కూడా సీఎం కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నిర్మాణ సంస్థలు, బిల్డర్లు వ్యర్థాలను నిబంధనల ప్రకారం పారవేయాలని, లేకపోతే చెత్త తరలించే వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తానని తెలిపారు. నగరంలో ఇప్పటికే ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోందని, బెంగళూరును పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం డీకే శివకుమార్ పిలుపునిచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news