విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గుణదల ఈఎస్ఐ ఆసుపత్రిని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సందర్శించి వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది అవసరాలపై సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును సందర్శించిన ఆయన రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో సమావేశమై ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలు, అవసరాలపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, 1968లో ప్రారంభమైన ఈఎస్ఐ ఆసుపత్రి ప్రస్తుతం సుమారు మూడు లక్షల మంది కార్డుదారులకు సేవలు అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ అర్హత వేతన పరిమితిని రూ.21 వేల నుంచి రూ.42 వేలకు పెంచడంతో భవిష్యత్లో కార్డుదారుల సంఖ్య దాదాపు తొమ్మిది లక్షలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సామర్థ్యాన్ని కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం మంజూరైన 155 పడకల ఆసుపత్రిని 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఇంత పెద్ద సంఖ్యలో కార్డుదారులు ఉన్న నేపథ్యంలో మెడికల్ కాలేజీని కూడా ఈ ఆసుపత్రికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అన్ని విభాగాలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
ఆసుపత్రిలో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునిక పరికరాల ఏర్పాటు వంటి అంశాలను ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. అవసరమైన అంశాలను కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆసుపత్రిని మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ పర్యటనలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి. జ్యోతి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ గాంధీ, ఆర్ఎంఓ డాక్టర్ జయశ్రీ, సీనియర్ వైద్యుడు డాక్టర్ రవికుమార్, ఇతర వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి ఉద్యోగులు పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఎంపీతో వారు చర్చించి తమ సమస్యలు, అవసరాలను వివరించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news