ఎడారి ప్రాంతాలకు జీవనాధారంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఒంటెలు ప్రస్తుతం మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో గుర్తింపు పొందిన తొమ్మిది ఒంటె జాతుల్లో ఆరు జాతులు ప్రమాదంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో మూడు జాతులు పూర్తిగా అంతరించే ముప్పును ఎదుర్కొంటుండగా, మరో మూడు జాతుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అరుదైన ఒంటె జాతులను సంరక్షించేందుకు బికనీర్‌లోని జాతీయ ఒంటె పరిశోధనా కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ సంరక్షణ కార్యక్రమంలో ప్రధానంగా ఖరాయి ఒంటె జాతిపై దృష్టి పెట్టనున్నారు. ప్రపంచంలోనే సముద్రంలో ఈదగల ఏకైక ఒంటెగా ఖరాయి ఒంటెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణంగా ఒంటెలు ఎడారి ప్రాంతాల్లో ఇసుకపై ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. కానీ ఖరాయి ఒంటె మాత్రం తీర ప్రాంత మడ అడవుల పర్యావరణ వ్యవస్థకు అనుగుణంగా జీవించే అరుదైన జాతిగా నిలిచింది.
జాతీయ ఒంటె పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వేద్ ప్రకాశ్ వివరాల ప్రకారం.. ఖరాయి ఒంటె ఇతర ఒంటె జాతుల కంటే పూర్తిగా భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి సముద్రంలో అనేక కిలోమీటర్ల దూరం ఈదుతూ మడ అడవులు, చిన్న చిన్న దీవులకు చేరుకుని ఆహారాన్ని పొందగలవు. ఈ ప్రత్యేక సామర్థ్యం కారణంగానే వీటిని "ఈత కొట్టే ఒంటెలు"గా కూడా పిలుస్తారు.
ఖరాయి ఒంటెల శరీర నిర్మాణం సముద్ర వాతావరణానికి అనుగుణంగా అభివృద్ధి చెందింది. వీటి కాళ్లు, శరీర ఆకృతి అలల మధ్య సులభంగా ప్రయాణించేందుకు సహకరిస్తాయి. సముద్రపు ఉప్పునీటిని కూడా తాగగల సామర్థ్యం వీటికి ఉంది. దాదాపు 10 వేల టీడీఎస్ వరకు ఉప్పు శాతం ఉన్న నీటిని కూడా ఇవి తట్టుకోగలవు. మడ అడవుల్లో లభించే ఆకులు, ఉప్పును తట్టుకునే తీర ప్రాంత మొక్కలపై ఆధారపడి జీవిస్తాయి.
ఖరాయి ఒంటెలు ప్రధానంగా గుజరాత్‌లోని కచ్ గల్ఫ్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి. కచ్, జామ్‌నగర్, దేవభూమి ద్వారక, మోర్బీ జిల్లాల్లో వీటి ఉనికి ఎక్కువగా ఉంది. ఈ ఒంటెలను సంప్రదాయంగా మాల్ధారి పశుపోషక సమాజం పెంచుతూ వస్తోంది. వారి జీవన విధానంలో ఖరాయి ఒంటెలు కీలక పాత్ర పోషించాయి.
అయితే కాలక్రమేణా అనేక కారణాల వల్ల ఈ అరుదైన జాతి సంఖ్య తగ్గుతూ వస్తోంది. వేగంగా పెరుగుతున్న యాంత్రీకరణ, మేత భూములు తగ్గిపోవడం, వాతావరణ మార్పులు, ప్రజల జీవనశైలిలో మార్పులు, సంప్రదాయ ఒంటె పెంపకంపై ఆసక్తి తగ్గడం వంటి అంశాలు ఒంటెల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
2019 పశుసంపద గణాంకాల ప్రకారం భారతదేశంలో ఖరాయి ఒంటెల సంఖ్య కేవలం 4,266 మాత్రమే ఉంది. ఇందులో సంతానోత్పత్తికి అనువైన మగ ఒంటెలు 569 ఉండగా, ఆడ ఒంటెల సంఖ్య 2,421గా నమోదైంది. ఈ సంఖ్యలు భవిష్యత్తులో ఈ జాతి మనుగడపై ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బికనీర్‌లోని జాతీయ ఒంటె పరిశోధనా కేంద్రం ఖరాయి ఒంటెలను సంరక్షించే ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఖరాయి ఒంటెల జన్యు లక్షణాలు, సంతానోత్పత్తి విధానం, వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం, సముద్ర వాతావరణానికి అనుకూలత వంటి అంశాలపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు.
శాస్త్రవేత్తలు ఈ అరుదైన జాతి దీర్ఘకాలిక మనుగడ కోసం ప్రత్యేక సంతానోత్పత్తి విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో ఖరాయి ఒంటెల సంఖ్యను పెంచడం, వాటి సహజ లక్షణాలను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఒకప్పుడు ఎడారి ప్రాంతాల్లో మనిషికి నమ్మకమైన తోడుగా నిలిచిన ఒంటెలు ఇప్పుడు అంతరించే దశకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఈత సామర్థ్యం కలిగిన ఖరాయి ఒంటె జాతిని రక్షించడం భారత జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక అడుగుగా మారనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news