శ్రీకాళహస్తిలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ ఎన్నికల వ్యవస్థ పనితీరును వారు ప్రశంసిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ఎన్నికల విధానం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని జయరాంరావు వీధి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో బూత్ స్థాయి అధికారులు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. జూన్ 15 నుంచి ప్రారంభమైన ఓటరు వివరాల సేకరణ, ఎన్యూమరేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కోలా ఆనంద్, మిన్నల్ రవి మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కొనసాగించుకోవాలంటే బీఎల్వోలు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపి నిర్దేశిత గడువులోగా సమర్పించాలని కోరారు. ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని, సరైన వివరాలను నమోదు చేయడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని తెలిపారు.
భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తోందని వారు కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో ఓటరు జాబితా సవరణ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు తమ వివరాలను సకాలంలో ధృవీకరించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం. ఉమేష్ రావు, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, బూత్ స్థాయి అధికారులు పద్మనాభ రెడ్డి, ఫర్హానా తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news