విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసి స్వర్ణాంధ్ర సాధనకు ప్రతినబూనాలని పిలుపునిచ్చారు.
దేశ స్వేచ్ఛ కోసం మహాత్మా గాంధీ, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితర మహనీయులు చేసిన పోరాటాలను మంత్రి స్మరించుకున్నారు. లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ అని పేర్కొన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఎన్టీఆర్ జిల్లాలో తనకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని లోకేష్ తెలిపారు. ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన పాఠ్యాంశాలు, విద్యా సామగ్రి అందిస్తున్నామని, పాఠశాలల్లో రాజకీయాలకు తావులేకుండా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు పరిశ్రమలు, విద్యాసంస్థలను అనుసంధానిస్తున్నామని తెలిపారు.
అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని, పోలవరం, విశాఖ రైల్వే జోన్, ఉక్కు పరిశ్రమ వంటి కీలక అంశాల్లో కేంద్ర సహకారం లభిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు వంటి నగరాలను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.
సింగపూర్ అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం, దీర్ఘకాలిక ఆలోచనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. స్వాతంత్ర్యాన్ని మహనీయులు సాధించారని, స్వర్ణాంధ్రను మాత్రం ప్రజలందరూ కలిసి నిర్మించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
వేడుకల అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను మంత్రి లోకేష్ తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news