ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రతిపాదన చేశారు. పిచ్చుకలంకలో ఉన్న 62 ఎకరాల పర్యాటక భూమిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా జీవోలో సవరణలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో ప్రకారం కేవలం 20 శాతం భూమినే పర్యాటక శాఖ వినియోగించుకోగలుగుతోందని, పూర్తి స్థాయిలో భూమిని ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ధవళేశ్వరం వద్ద రూ.151 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పునరుద్ధరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర అభివృద్ధి, రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. గోదావరి డెల్టా రైతుల ప్రయోజనాల కోసం సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజీ గేట్ల ఆధునికీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గేట్ల పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వం వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని మంత్రి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోలు, పెన్షన్ పెంపు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని వివరించారు.
పిచ్చుకలంకను రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇందుకోసం పర్యాటక శాఖకు పూర్తి భూవినియోగ హక్కులు కల్పించేలా జీవోలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గోదావరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు జనసేన పార్టీ, కూటమి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news