నిడదవోలు మండలం తాళ్లపాలెం అండర్ బ్రిడ్జిలో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఏర్పడిన అంతరాయంపై మంత్రి కందుల దుర్గేష్ ముంబయి పర్యటనలో ఉన్నప్పటికీ తక్షణమే స్పందించారు. సమస్యపై సమాచారం అందిన వెంటనే వీడియో కాల్ ద్వారా అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించిన మంత్రి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తాళ్లపాలెం అండర్ బ్రిడ్జిలో పరిసర ప్రాంతాల చేలు, కాలువల నుంచి భారీగా నీరు చేరడంతో తాడేపల్లిగూడెం వైపు వెళ్లే మార్గంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి దుర్గేష్ దూరంలో ఉన్నప్పటికీ సాంకేతికతను వినియోగించి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. తన కార్యాలయ సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగం, కూటమి నాయకులతో సమన్వయం చేసి వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు, నిడదవోలు ఎంపీడీవో ఆంజనేయ శర్మ, తహశీల్దార్ నాయక్, మంత్రి వ్యక్తిగత సిబ్బంది, కూటమి నాయకులు తాళ్లపాలెం గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన నీటి కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, నీటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. దీంతో రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.
చేలు, కాలువల నుంచి నీరు చేరడం వల్ల గతంలో కూడా ఈ సమస్య పలుమార్లు తలెత్తిందని అధికారులు మంత్రికి వివరించారు. కేవలం తాత్కాలిక చర్యలతో కాకుండా భవిష్యత్తులో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. రైతులు, గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ముంబయిలో ఉన్నప్పటికీ స్థానిక సమస్యపై మంత్రి దుర్గేష్ వెంటనే స్పందించిన తీరు పట్ల తాళ్లపాలెం గ్రామ ప్రజలు, రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలకు దూరం నుంచైనా స్పందించి పరిష్కారం చూపడం ప్రజాప్రతినిధి బాధ్యతకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులను వెంటనే రంగంలోకి దింపిన మంత్రికి ప్రజలు అభినందనలు తెలిపారు.
ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా వెంటనే స్పందించి పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వర్గం పేర్కొంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపింది. తాళ్లపాలెం అండర్ బ్రిడ్జి సమస్య పరిష్కారంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news