మంగళగిరిలో మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతల ఆటవిక చర్యలకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహమే కారణమని విమర్శించారు. యువతను అభివృద్ధి, ఉపాధి దిశగా నడిపించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, వారిని రౌడీయిజం, గంజాయి సంస్కృతి వైపు మళ్లించే పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లాలో దళిత కుటుంబంపై జరిగిన దాడి ఘటనను మంత్రి తీవ్రంగా ఖండించారు. మహిళలు, దళితులు, బలహీన వర్గాలపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ వైసీపీ నాయకత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. సామాజిక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన పార్టీ నాయకులు మౌనం పాటించడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతోందని విమర్శించారు.
రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారికి ఎలాంటి రాజకీయ అండ ఉండదని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరైనా నేరానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజ్యాంగ విరుద్ధ చర్యలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news