ఫ్యాన్కోనీ అనీమియాతో బాధపడుతున్న బాలుడు చరణ్ తేజ పవన్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అండగా నిలిచారు. అరుదైన ఈ వ్యాధితో పోరాడుతున్న చిన్నారికి అవసరమైన వైద్యం అందేలా దాతలు, సేవా సంస్థల సహకారంతో నిధులు సమీకరించి చికిత్సకు మార్గం సుగమం చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వైద్య ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
బాలుడికి అవసరమైన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సుమారు రూ.20 లక్షల వ్యయం అవుతుండగా, ఆ మొత్తాన్ని సమీకరించి చికిత్సకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అవసరమైన బోన్ మ్యారో దాత నుంచి సేకరణ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. దీంతో చిన్నారి చికిత్స కీలక దశకు చేరుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చరణ్ తేజ పవన్‌కు వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. బాలుడు త్వరగా కోలుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం, దాతలు, సేవా సంస్థలు సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడే వరకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news