చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు భారీ ఊరటనిచ్చేలా ఎంఎస్ఎంఈ చట్టంలో కీలక మార్పులకు మార్గం సుగమమైంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు–2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆగస్టు 3న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించగా, ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం, అధికారిక నోటిఫికేషన్ అనంతరం ఇది చట్టంగా అమల్లోకి రానుంది.
2006 నాటి ఎంఎస్ఎంఈ చట్టంలో చెల్లింపులు, వివాద పరిష్కారం, నమోదు ప్రక్రియలు, జరిమానాలకు సంబంధించిన నిబంధనలను ఈ సవరణ బిల్లు గణనీయంగా మార్చనుంది. అయితే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వర్గీకరణ విధానం మాత్రం కొనసాగుతుంది. పెట్టుబడి, టర్నోవర్ ఆధారంగా ఎంఎస్ఎంఈలను విభజించే విధానం యథాతథంగా ఉంటుంది.
గత చట్టంలో సూక్ష్మ పరిశ్రమల అర్హతకు నిర్దిష్ట పెట్టుబడి, టర్నోవర్ పరిమితులు ఉండేవి. భవిష్యత్తులో ఈ పరిమితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే అవకాశం కల్పించారు. దీంతో ప్రతిసారి చట్ట సవరణ చేయాల్సిన అవసరం లేకుండా మార్పులు చేపట్టవచ్చు.
చిన్న వ్యాపారాలకు అత్యంత కీలకమైన మార్పు చెల్లింపుల విధానంలో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు చెల్లించాల్సిన బకాయిలను 45 రోజుల్లోపు పరిష్కరించాలనే నిబంధన ఉన్నప్పటికీ, దానిని అమలు చేయడానికి కఠినమైన నిబంధనలు, జరిమానాలు లేవు. కొత్త చట్టంతో చెల్లింపుల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారనుంది.
ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ సంస్థలకు సరఫరాలు చేసే చిన్న వ్యాపారులకు కొత్త నిబంధనలు ప్రయోజనం చేకూర్చనున్నాయి. వీరు జారీ చేసే బిల్లులను తప్పనిసరిగా ఆర్బీఐ నిర్వహించే ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (ట్రెడ్స్) వేదికపై నమోదు చేయాల్సి ఉంటుంది.
ట్రెడ్స్ అనేది డిజిటల్ వేదిక. ఇందులో వ్యాపారులు తమ సరఫరాలకు సంబంధించిన బిల్లులను నమోదు చేస్తారు. కొనుగోలుదారు ఆ బిల్లులను ధ్రువీకరించిన తర్వాత బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వాటిని డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేస్తాయి. దీంతో చిన్న వ్యాపారులకు బిల్లు మొత్తం చెల్లింపు కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.
సాధారణంగా చిన్న వ్యాపారులు కొనుగోలుదారులకు 45 నుంచి 60 రోజుల వరకు రుణ సదుపాయం కల్పిస్తుంటారు. ట్రెడ్స్ ద్వారా వారికి తక్షణ నగదు ప్రవాహం అందుతుంది. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు తప్పనిసరిగా ఈ విధానంలోకి రావడం వల్ల చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న చెల్లింపుల ఆలస్య సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
మరో కీలక మార్పు వివాద పరిష్కార ప్రక్రియలో తీసుకొచ్చారు. గతంలో వివాద పరిష్కారానికి నిబంధనలు ఉన్నప్పటికీ కాలపరిమితి స్పష్టంగా ఉండేది కాదు. కొత్త చట్టంలో మధ్యవర్తిత్వం, పరిష్కార ప్రక్రియలకు 90 రోజుల గడువు విధించారు. అప్పీళ్లకు 30 రోజుల సమయం, తుది పరిష్కారానికి 60 రోజుల పరిమితి నిర్ణయించారు.
మధ్యవర్తిత్వం లేదా పరిష్కార ప్రక్రియ ద్వారా ఇచ్చే తీర్పులకు మరింత చట్టబద్ధత కల్పించారు. ఈ తీర్పులను భూ బకాయిల మాదిరిగా వసూలు చేసే అవకాశం అధికారులకు కల్పించారు. అలాగే దివాలా చట్టం కింద కూడా వీటిని రుణంగా పరిగణించేలా నిబంధనలు రూపొందించారు.
దీంతో కొనుగోలుదారు సంస్థ దివాలా తీసినా, సరఫరాదారైన ఎంఎస్ఎంఈలకు తమ బకాయిలపై స్పష్టమైన హక్కు ఉంటుంది. చిన్న వ్యాపారుల ఆర్థిక భద్రత పెరగడంతో పాటు, దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి ఈ చట్ట సవరణలు దోహదపడతాయని భావిస్తున్నారు.
మొత్తంగా ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు–2026 చిన్న వ్యాపారులకు వేగవంతమైన చెల్లింపులు, సులభమైన వివాద పరిష్కారం, మెరుగైన ఆర్థిక భద్రత కల్పించే దిశగా కీలక అడుగుగా నిలవనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news