రంపచోడవరం గిరిజన విద్యార్థిని ముర్రం శివానీ మృతి పట్ల రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న మెగా పేరెంట్-టీచర్స్ సమావేశంలో తన ప్రతిభతో ప్రశంసలు అందుకున్న శివానీ అకాల మరణం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రంపచోడవరంలోని తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందిన శివానీ కుటుంబాన్ని ఎమ్మెల్యే శిరీషాదేవి పరామర్శించారు. తల్లిదండ్రులు వర ప్రసాద్, సౌభాగ్యవతి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. చిన్నారి మృతిపై విచారణ జరిపి పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని అధికారులను కోరారు.
శివానీ మరణవార్త విన్న ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యుల ఆవేదన చూసి కన్నీటి పర్యంతమయ్యారు. శివానీ భౌతికకాయానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన కార్యక్రమంలో శివానీ తన మాటతీరుతో అందరి ప్రశంసలు పొందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతిభావంతమైన విద్యార్థిని అకాల మరణం చెందడం తీరని లోటని పేర్కొన్నారు.
శివానీ మృతదేహాన్ని చూసిన సహచర విద్యార్థులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమతో కలిసి చదువుకున్న విద్యార్థిని ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ సభ్యులు షేక్ సుభానీ, మండల పార్టీ అధ్యక్షుడు పెంటపాటి అనంత మోహన్, నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షుడు పండా బాపన్న దొర, కడబాల గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news