చీరాల నియోజకవర్గంలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత విద్యుత్ పథకం కింద వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామంలో చేనేత కుటుంబాలకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ కార్మికులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ పథకం వేగంగా అమలు అవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,04,488 కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుండగా, ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640, పవర్లూమ్ యూనిట్లకు రూ.21,600 వరకు ఆదా కానుంది. మొత్తం మీద సుమారు రూ.150 కోట్ల ఆర్థిక ఉపశమనం కలుగుతుందని వివరించారు.

చీరాల నియోజకవర్గంలోని 4,404 చేనేత కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయని తెలిపారు. గతంలో చేనేత రంగం ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంపు, త్రిఫ్ట్ ఫండ్ కేటాయింపు, యంత్రాలపై రాయితీలు, ముడిసరుకు సబ్సిడీలు, క్లస్టర్ అభివృద్ధి వంటి అనేక చర్యలు తీసుకుందని వివరించారు. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వేదికల ద్వారా మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా చేనేత ఉత్పత్తులకు కొత్త మార్కెట్ అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, నేతన్నల ఆర్థికాభివృద్ధికి నిరంతరం తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news