నైజీరియాలోని జంఫారా రాష్ట్రంలో సాయుధ దుండగులు మరోసారి బీభత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత కసువార్ దాజీ గ్రామంతో పాటు సమీపంలోని సైనిక స్థావరంపై దాడి చేసి కనీసం 52 మందిని అపహరించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. అపహరించబడిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. తొలుత వంద మందికి పైగా గ్రామస్థులను బంధించిన దుండగులు, అనంతరం కొందరిని విడిచిపెట్టి 52 మందిని తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు ముందుగా సైనిక స్థావరంపై దాడి చేసి అక్కడి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సైనిక వాహనానికి నిప్పంటించి గ్రామంలోకి ప్రవేశించి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను అపహరించారు. గ్రామస్థుల కథనం ప్రకారం, పలువురు కుటుంబాల నుంచి మహిళలు, యువతులు, చిన్నారులను బలవంతంగా తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనలో సైనికులు ఎవరూ అపహరణకు గురికాలేదని అధికారులు తెలిపారు.
సైన్యం స్పందిస్తూ దాడిని తిప్పికొట్టినట్లు ప్రకటించింది. ఈ ఘటనలో ఒక సైనికుడు, ఒక పోలీసు అధికారి మరణించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో పొరుగున ఉన్న సోకోటో రాష్ట్రంలోని ఓ గ్రామంపైనా మరో దాడి జరిగి కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. నైజీరియా వాయువ్య ప్రాంతంలో పనిచేస్తున్న సాయుధ ముఠాలు అపహరణలను ఆదాయ వనరుగా మార్చుకున్నాయని, గ్రామాలపై దాడులు, దోపిడీలు, పశువుల దొంగతనాలు, అక్రమ మైనింగ్ కార్యకలాపాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news