విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న పి-4 కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన కనుపర్తి శేషమ్మకు రూ. 13 వేల విలువైన కుట్టు మిషన్ను తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా రవితేజ అందజేశారు. సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కుట్టు మిషన్ను అందించారు. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబాలను పోషించుకునేలా జీవనోపాధి సాధనాలను అందించడమే పి-4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని బొండా రవితేజ తెలిపారు.
ఇటీవల నిర్వహించిన ప్రజా దర్బార్లో కనుపర్తి శేషమ్మ ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును కలిసి తన పరిస్థితిని వివరించారు. ఈ వయసులో కూడా కుట్టుపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో తనకు కుట్టు మిషన్ అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శేషమ్మ సమస్యను విన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెంటనే స్పందించి, పి-4 కార్యక్రమం ద్వారా ఆమెకు కుట్టు మిషన్ అందించాలని యువ నాయకుడు బొండా రవితేజకు సూచించారు. ఎమ్మెల్యే సూచన మేరకు రవితేజ వెంటనే స్పందించి కుట్టు మిషన్ను శేషమ్మకు అందజేశారు.
ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిజంగా అవసరంలో ఉన్న పేద కుటుంబాలను గుర్తించి వారికి అండగా నిలవడమే పి-4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, వారు భవిష్యత్తులో తమకు తాముగా ఆదాయం సంపాదించుకునేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కేవలం ఆర్థిక సహాయం అందించడం కాకుండా, జీవనోపాధి కల్పించే సాధనాలను అందించడం ద్వారా పేద కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
మహిళలు తమ కుటుంబ అవసరాలను తామే తీర్చుకునే స్థాయికి ఎదగాలని, ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడాలని బొండా రవితేజ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మహిళలు, పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ బళ్లు, తోపుడు బండ్లు వంటి జీవనోపాధి సాధనాలను అందజేశామని తెలిపారు. చిన్న సహాయం ఒక కుటుంబానికి నిరంతర ఆదాయ మార్గాన్ని చూపగలదని, అందుకే అవసరమైన వారికి సరైన సమయంలో సరైన సాధనం అందించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు.
ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, బొండా సిద్ధార్థతో కలిసి విద్య, వైద్యం, ఆర్థిక సహాయం వంటి వివిధ అవసరాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నామని బొండా రవితేజ తెలిపారు. పేద కుటుంబాలను ఆదుకోవడం కేవలం బాధ్యతగా కాకుండా సమాజం పట్ల ఉన్న కర్తవ్యంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. సమాజంలో ఎవరూ వెనుకబడకుండా, ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా తమ వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. మహిళలకు జీవనోపాధి కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగేలా చర్యలు కొనసాగిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, 31వ డివిజన్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాసరావు, దేవరపు మాల్యాద్రి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, దొండపాటి సుల్తానా, కంచేటి నాగరాజు, దేవర సత్యనారాయణ, లబ్బా వైకుంఠం, ఎస్కే పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. పి-4 కార్యక్రమం ద్వారా తనకు కుట్టు మిషన్ అందడంతో శేషమ్మ సంతోషం వ్యక్తం చేశారు. తనకు స్వయం ఉపాధి చేసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, బొండా రవితేజకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news