తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకల్లో ముందుగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు 32 మీటర్ల ఎత్తైన ఎలక్ట్రానిక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత 30 మీటర్ల ఎత్తైన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు, కార్యకర్తలు గౌరవప్రదంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి విప్ వేపాడ చిరంజీవి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ హసన్ బాషా, శ్రీశైలం ఆలయ బోర్డు సభ్యులు ఏవీ రమణ, అన్నవరం దేవస్థానం డైరెక్టర్ రావిపాటి సత్యనారాయణ, మీడియా సమన్వయకర్త ధారపనేని నరేంద్రబాబు, నేతలు ధారునాయక్, సుకవాసి శ్రీనివాస్, సత్యవాణి, కుక్కల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా జాతీయ పండుగలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం తమ జీవితాలను అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి తరం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడమేనని పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చిన ఆనందంతో పాటు దేశ విభజన సమయంలో కోట్లాది మంది అనుభవించిన విషాదాన్ని కూడా మరచిపోకూడదన్నారు. స్వస్థలాలను విడిచి వలస వెళ్లిన కుటుంబాలు, ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది విషాదాన్ని భారత చరిత్రలో భాగంగా గుర్తుంచుకోవాలని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ప్రస్తుత తరానికి అత్యంత ముఖ్యమైన బాధ్యత అని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఒకప్పుడు విదేశీ పాలకులతో పోరాడినట్లే, నేడు ప్రజాస్వామ్య విలువలను బలహీనపరిచే ఆలోచనా విధానాలతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులను ప్రజలు గమనించారని, అధికారం ఎవరి చేతిలో పెట్టాలన్న విషయంలో ప్రజలు లోతుగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత రెండేళ్లుగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం కొనసాగుతోందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించే వరకు తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. సమసమాజ నిర్మాణం, మత సామరస్యం, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడమే స్వతంత్ర సమరయోధులకు నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
జాతీయ జెండా కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదని, దేశం మనకు ఏమిచ్చిందనే ప్రశ్నతో పాటు మనం దేశానికి, రాష్ట్రానికి ఏమి అందించామనే ఆత్మపరిశీలనకు అది ప్రతీక అని పల్లా వివరించారు. దేశం, రాష్ట్రం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమరయోధుల స్ఫూర్తితో స్వర్ణాంధ్ర నిర్మాణంలో పార్టీ తన బాధ్యతను నిర్వర్తిస్తుందని స్పష్టం చేశారు.
స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర కార్యాలయానికి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 32 మీటర్ల ఎత్తైన ఎలక్ట్రానిక్ జాతీయ జెండా ఆవిష్కరణతో కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఆకర్షణ నెలకొంది. దేశభక్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తి, జాతీయ ఐక్యతను చాటుతూ నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news