కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఫిర్యాదు అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అంబటి రాంబాబు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెమ్మసాని చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసినట్లుగా చూపించేలా ఏఐ వీడియోను రూపొందించి పోస్ట్ చేశారని పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించారు.
ప్రజా సమస్యలపై పోరాడటం ద్వారా నాయకులు ఎదగాలని, వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో గుర్తింపు పొందాలని ప్రయత్నించడం సరికాదని అన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌పై అభ్యంతరకర వీడియోను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు.
పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు అభివృద్ధికి కృషి చేస్తున్నారని, రహదారులు, వైద్య సదుపాయాలు, ప్రజా అవసరాలకు సంబంధించిన పలు కార్యక్రమాలు చేపడుతున్నారని పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేయడం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని అన్నారు.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, మార్ఫింగ్ వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంబటి రాంబాబు చేసిన వీడియోపై కేసు నమోదు అవుతుందని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని పిల్లి మాణిక్యరావు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news