ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయనకు గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ సమీపంలో సుమారు 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలు ప్రధానమంత్రి పర్యటనకు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి.
ఉదయం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొని విమానాశ్రాయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొని అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి విశేష ప్రాధాన్యం ఏర్పడింది.
విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి మోదీ ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రహదారి ఇరువైపులా ప్రజలు నిలబడి ప్రధానమంత్రికి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయడంతో పాటు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సభా ప్రాంగణంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన కీలక అంశాలపై ప్రధానమంత్రి ప్రసంగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సభ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు. ఆయన పర్యటన మొత్తం వ్యవధిలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా కొనసాగనున్నాయి. విమానాశ్రయం, సభా ప్రాంగణం, ప్రయాణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ప్రత్యేక భద్రతా బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను అమలు చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news