ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, టెర్మినల్ భవనం, సభా ప్రాంగణం, థింసా నృత్య వేదికలను సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 3 వేల సీసీ కెమెరాల ద్వారా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, జనసమీకరణపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ భద్రతను మరింత పటిష్టం చేశారు.
బందోబస్తు నిర్వహణలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
ప్రధాని పర్యటన విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news