ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
భోగాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ తెలుగులో ‘అందరికీ నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవాలైన సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవార్లకు ప్రణామాలు అర్పించిన ఆయన, పవిత్రమైన ఈ ప్రాంతానికి రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలకమైన రోజు అని, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్‌కు కొత్త శుభదినమని తెలిపారు.
విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ముందు నిర్వహించిన గిరిజన సంప్రదాయ థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.13 వేల మందికి పైగా గిరిజన మహిళలు ఒకే వేదికపై ప్రదర్శించిన ఈ నృత్యం అద్భుతమని ప్రధాని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టిని ప్రశంసించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్‌వేగా మారడంతో పాటు యువతకు కొత్త అవకాశాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో విమానయాన రంగ అభివృద్ధి గురించి ప్రధాని మాట్లాడుతూ, గతంలో విమానాశ్రయాలకు కొందరి పేర్లకే ప్రాధాన్యత ఇచ్చేవారని, ప్రస్తుతం స్థానిక మహనీయులకు గౌరవం కల్పిస్తున్నామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గర్వకారణమన్నారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, గత కొన్నేళ్లలో వాటి సంఖ్యను 166కు పెంచామని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు పోర్టుల అభివృద్ధి, మూలపేట, రామాయపట్నం వంటి కొత్త పోర్టుల నిర్మాణం ద్వారా సముద్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తెలుగు ప్రజల ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా తయారీ రంగ కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. సెమీకండక్టర్ పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులు రావడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పెరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త అవకాశాలకు ద్వారం తెరిచిందని వారు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news