కేంద్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడం, వ్యాపారాలకు అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేయడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సేవా తీర్థ్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో పరిపాలనా సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల అమలు, ప్రభుత్వ పనితీరు మెరుగుదల వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రెండు ప్రధాన అంశాలు కేంద్రబిందువుగా నిలిచాయి. మొదటిది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మరియు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను మరింత మెరుగుపరచేందుకు అనవసర నిబంధనల సరళీకరణ, పరిపాలనా సంస్కరణలు చేపట్టడం. రెండోది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలను వేగవంతంగా అమలు చేయడం ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడం. విదేశీ ఉత్పత్తులపై ఆధారాన్ని తగ్గిస్తూ దేశీయ ఉత్పత్తి, పరిశ్రమలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల కార్యదర్శులు తమ శాఖల్లో జరుగుతున్న సంస్కరణలు, విధానాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ప్రధానికి వివరించారు. ప్రభుత్వ లక్ష్యాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా శాఖలు విడివిడిగా కాకుండా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు.
ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకే దిశగా పనిచేసే విధానాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించిన ప్రధాని, శాఖల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమాచార మార్పిడి, డేటా ఆధారిత నిర్ణయాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమన్వయం కోసం రూపొందించిన పీఎం గతిశక్తి వేదికను మరింత విస్తృతంగా వినియోగించాలని సూచించారు.
ప్రభుత్వ పథకాల విజయాన్ని కేవలం అమలు పరంగా కాకుండా, వాటి వల్ల ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల ఆధారంగా అంచనా వేయాలని మోదీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే విధంగా పాలన సాగాలని, ఫలితాల ఆధారిత పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
సమావేశంలో కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన తొలి పూర్తి స్థాయి కార్యదర్శుల సమావేశంగా ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక సంస్కరణలపై దృష్టి సారిస్తున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరల హెచ్చుతగ్గులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం కల్పించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం దిశగా ఈ సమావేశంలో కీలక మార్గదర్శకాలు వెలువడినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news