భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. “అందరికీ నమస్కారం” అంటూ తెలుగు ప్రజలను పలకరించిన ప్రధాని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ రోజు ఎంతో కీలకమైన రోజు అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ లక్ష్యాల సాధనలో ఈ రోజు ఒక శుభదినమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం వంటి ఆధునిక మౌలిక వసతుల ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తాయని తెలిపారు.
పవిత్రమైన ఉత్తరాంధ్ర గడ్డపై అడుగుపెట్టే అవకాశం తనకు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర ప్రజల అభిమానం, ఆతిథ్యం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా సింహాచలం అప్పన్న స్వామికి, పైడితల్లి అమ్మవారికి ప్రధాని మోదీ తన ప్రణామాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకరిస్తుందని పేర్కొన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం రాష్ట్ర రవాణా రంగంలోనే కాకుండా పరిశ్రమలు, పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు కూడా కీలకంగా మారనుందని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రయాణంలో ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news