కేరళలోని ప్రముఖ శబరిమల శ్రీ ధర్మశాస్త ఆలయంలో గుర్తించిన వాక్దోషం నివారణకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఆధ్వర్యంలో కేరళతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని 25 ఆలయాల్లో పరిహార క్రతువులను నిర్వహిస్తున్నారు. రాబోయే మండల తీర్థయాత్ర సీజన్‌కు ముందే ఈ పూజా కార్యక్రమాలను పూర్తి చేయాలని దేవస్వం బోర్డు నిర్ణయించింది.
2018లో శబరిమల ఆలయంలో నిర్వహించిన అష్టమంగళ దేవప్రశ్నంలో వాక్దోషం ఉన్నట్లు గుర్తించారు. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం, ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది భక్తులతో దురుసుగా మాట్లాడటం, అనుచిత ప్రవర్తన చేయడం వల్ల ఈ దోషం ఏర్పడిందని పేర్కొన్నారు. దీనికి పరిహారంగా కొన్ని ప్రత్యేక పూజలు, నైవేద్యాలు నిర్వహించాలని దేవప్రశ్నంలో సూచించారు.
ఈ సూచనల మేరకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పరిహార కార్యక్రమాలను ప్రారంభించింది. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆలయం, కాసరగోడ్ జిల్లాలోని బేల కుమారమంగళం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వంటి ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మూకాంబిక ఆలయంలో దేవప్రశ్నంలో సూచించిన విధంగా వెండి నాలుక, గంట, లేఖిని వంటి ప్రతీకాత్మక వస్తువులను సమర్పించారు.
శబరిమల సన్నిధానంలో ఆగస్టు 3న నిర్వహించిన నిరపుతరి ఉత్సవంలో పవిత్రం చేసిన గంటను అనంతరం మూకాంబిక ఆలయానికి తీసుకెళ్లారు. నవరాత్రి ఉత్సవాల అనంతరం అక్కడ మహాపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాసరగోడ్ జిల్లాలోని కుమారమంగళం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్తీక పూజ, రూ.1001 మహా కానుక సమర్పణ ఇప్పటికే పూర్తయ్యాయి. అదే రోజు మూకాంబిక ఆలయంలో జరిగే మహాపూజ సమయంలో ప్రత్యేక రంగపూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
శబరిమల కార్యనిర్వహణ అధికారి పీఎస్ శాంతకుమార్, శ్రీనివాస్ తదితర అధికారులు ఈ పరిహార పూజలను పర్యవేక్షిస్తున్నారు. కన్నూర్‌లోని ఎడక్కాడ్ మహావిష్ణు ఆలయం, త్రిశూర్‌లోని వడక్కున్నాథన్ ఆలయం, ఇరింజాలకుడలోని కూడల్మాణిక్యం ఆలయం, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం వంటి ప్రముఖ ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
గురువాయూర్ ఆలయంలో నిర్దేశించిన పరిహార కార్యక్రమాల్లో నిర్మాల, నెయ్యి దీపం, పాలపాయసం, కానుక సమర్పణ వంటి పూజలు ఉన్నాయి. మిగిలిన ఆలయాల్లో కూడా రానున్న రోజుల్లో ఇదే విధమైన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఈ పూజలు పూర్తయితే శబరిమల ఆలయానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని దేవప్రశ్నంలో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.
ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు, మాజీ కేరళ ప్రధాన కార్యదర్శి కే జయకుమార్ గతంలో మాట్లాడుతూ అన్ని పరిహార క్రతువులు పూర్తయిన తర్వాత ఆలయం స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, శబరిమల ఆలయం చింగం మాస పూజల కోసం ఆగస్టు 16న తిరిగి తెరుచుకోనుంది. ఆగస్టు 21 వరకు భక్తులకు దర్శన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అనంతరం ఓణం పూజల కోసం ఆగస్టు 24 నుంచి 28 వరకు ఆలయం తెరిచి ఉంచనున్నారు. భక్తులు అధికారిక శబరిమల పోర్టల్ ద్వారా వర్చువల్ క్యూ టికెట్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news