ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డీఐజీ పర్మీందర్ సింగ్, ఆయన డ్రైవర్ రామ్‌శరణ్ మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సర్సావా పోలీస్ స్టేషన్ పరిధిలోని డెహ్రాడూన్-పంచకుల జాతీయ రహదారిపై ఉదయం 11 గంటల సమయంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, డీఐజీ పర్మీందర్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనంలో ఆయనతో పాటు డ్రైవర్ రామ్‌శరణ్, గన్నర్ జైరామ్ ఉన్నారు. వేగంగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం వాహనం ఎదురులేన్లోకి దూసుకెళ్లి అటువైపు నుంచి వస్తున్న స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ ఘటనలో డీఐజీ పర్మీందర్ సింగ్, డ్రైవర్ రామ్‌శరణ్ అక్కడికక్కడే మృతి చెందారు. డీఐజీ గన్నర్ జైరామ్ తీవ్రంగా గాయపడ్డారు. స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న గురునానక్ సింగ్, దేవేంద్ర కౌర్, గుర్నామ్ సింగ్ కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సహాయంతో పిల్ఖానిలోని వైద్య కళాశాలకు తరలించారు. వైద్యులు పర్మీందర్ సింగ్, రామ్శరణ్ను ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
పర్మీందర్ సింగ్ పంజాబ్‌లోని రూప్‌నగర్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సూరీలో శిక్షణ పూర్తి చేసుకుని హర్యానాలోని అంబాలాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న సహరాన్పూర్ జిల్లా కలెక్టర్ అరవింద్ చౌహాన్, ఎస్పీ అభినందన్ సింగ్ వైద్య కళాశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, ప్రమాదంపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news