విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి సిట్ అధికారులు సీఐ నాగరాజును రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగిన విచారణలో పలు కీలక అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే సీఐ నాగరాజు చాలా ప్రశ్నలకు తనకు తెలియదని, సంబంధం లేదని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది.
కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోని ఇంటరాగేషన్ గదిలో కనిపించిన రక్తపు మరకలు, అనంతరం ఆ గదికి పెయింట్ వేయించిన అంశంపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నించినట్లు సమాచారం. రక్తపు మరకలు ఎవరివి, ఆ గదికి ఎందుకు పెయింట్ వేయించారనే ప్రశ్నలకు తనకు ఎలాంటి సమాచారం లేదని, తాను పెయింట్ వేయించలేదని సీఐ నాగరాజు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
పెయింట్ వేయించడం తన ఆదేశాల మేరకే జరిగిందని ఓ కానిస్టేబుల్ చెప్పిన విషయాన్ని సిట్ అధికారులు ప్రస్తావించగా, ఆ కానిస్టేబుల్ అలా ఎందుకు చెప్పాడో అతడినే అడగాలని సీఐ నాగరాజు చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నట్లుగా ఆయన సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
గాదె సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ బృందం మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించిన అంశంపై కూడా అధికారులు ప్రశ్నించారు. అయితే సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చిన విషయం తన దృష్టికి రాలేదని, సెంట్రీలకు అప్పగించి ఉంటారని సీఐ నాగరాజు చెప్పినట్లు సమాచారం.
అలాగే సాయికృష్ణకు ఆర్ఎంపీతో ఇంజెక్షన్ ఎందుకు ఇప్పించాల్సి వచ్చిందనే ప్రశ్నకు కూడా తనకు తెలియదని, ఆర్ఎంపీని పిలిచిన కానిస్టేబుల్‌ను అడగాలని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే సేకరించిన ఆధారాలను చూపిస్తూ ప్రశ్నించినప్పటికీ, సీఐ నాగరాజు సహకరించకుండా మౌనంగా ఉన్నట్లు సమాచారం.
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు సిట్ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పరిణామాలు, సంబంధిత వ్యక్తుల పాత్ర, సాక్ష్యాల ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news