విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు, సీఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న సురేష్ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ముమ్మరంగా గాలిస్తోంది. సాయికృష్ణ మరణం, అనంతరం మృతదేహం మాయం చేసిన వ్యవహారంలో సురేష్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో అతడి ఆచూకీ కోసం సిట్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్ గతంలో సీఐ నాగరాజుకు సన్నిహితంగా వ్యవహరించేవాడని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరచూ వెళ్లి సీఐ వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలను చూసుకునేవాడని సమాచారం. అంతేకాకుండా నాగరాజుకు డ్రైవర్గా కూడా పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. సీఐ ఆదేశాల మేరకు సాయికృష్ణ మృతదేహాన్ని తరలించడం లేదా దాచిపెట్టడంలో సురేష్ పాత్ర ఉందా అనే కోణంలో సిట్ విచారణ కొనసాగిస్తోంది.
సాయికృష్ణ కస్టడీ మరణం తర్వాత కానిస్టేబుళ్లు అశోక్, నానితో పాటు సురేష్ కూడా కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత కానిస్టేబుళ్లు ఇద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయి విచారణకు సహకరిస్తుండగా, సురేష్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. అతడి కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సురేష్ గతంలో ఓ రాజకీయ నాయకుడి కార్యాలయంలో తిరుగుతూ ఉండేవాడని, అక్కడే ఎక్కువగా కనిపించేవాడని సమాచారం అందడంతో ఆ దిశగా కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
సురేష్ ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని సిట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని నిందితులుగా గుర్తించిన సిట్ ఐదుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు సాయికృష్ణ మృతి వ్యవహారంలో మరికొందరు పోలీసు సిబ్బంది ప్రమేయం ఉండే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కస్టడీలో ఉన్న సీఐ నాగరాజు విచారణలో సహకరించడం లేదని సమాచారం. సిట్ కస్టడీలో నాలుగో రోజైన ఆదివారం కూడా ఆయన అదే వైఖరిని కొనసాగించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు అధికారులు పలు ఆధారాలను చూపించి ప్రశ్నించినప్పటికీ నాగరాజు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. సాక్ష్యాలు, పత్రాలు, ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా వివరాలు రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.
సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన సమయంలో తప్పుడు అఫిడవిట్ ఎందుకు సమర్పించారని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే సాయికృష్ణను తీసుకురావాలని టాస్క్ఫోర్స్ పోలీసులకు రాసిన లేఖ, మార్కాపురం నుంచి తీసుకొచ్చిన అనంతరం స్టేషన్ సెంట్రీకి అప్పగించినట్లు ఉన్న ఆధారాలను చూపించి విచారించినా తనకు తెలియదనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో సిట్ దర్యాప్తు కీలక మలుపులో ఉంది. సురేష్ అరెస్టు, నాగరాజు నుంచి పూర్తి వివరాల సేకరణ, మరికొందరి ప్రమేయంపై స్పష్టత రావడంతో కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news