రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో సీఐ నాగరాజుకు సన్నిహితుడిగా ఉన్న ప్రైవేటు వ్యక్తి సురేష్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. కోర్టుకు సమర్పించిన మెమోలో సిట్ అధికారులు సురేష్‌ను నిందితుడిగా పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆయనను అధికారికంగా అరెస్టు చూపించలేదు. ఇప్పటికే పలుమార్లు సురేష్‌ను పిలిచి విచారించిన సిట్ అధికారులు తాజాగా మరోసారి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
సురేష్ ఈ కేసులో అప్రూవర్‌గా మారే అవకాశం ఉందని సమాచారం. ప్రైవేటు వ్యక్తి అయినప్పటికీ సీఐ నాగరాజుతో సన్నిహిత సంబంధాలు ఉండటం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన ప్రభావం చూపడం వంటి అంశాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఆయన మృతి చెందే వరకు జరిగిన పరిణామాలపై సురేష్‌కు పూర్తి అవగాహన ఉందని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.
సాయికృష్ణను స్టేషన్ నుంచి బయటకు ఎందుకు తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడెక్కడికి తరలించారు, తిరిగి ఎప్పుడు స్టేషన్‌కు తీసుకొచ్చారు వంటి కీలక వివరాలను సురేష్ నుంచి సిట్ అధికారులు రాబట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితులు విచారణలో కీలక వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సురేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాత్రపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు. విచారణలో కొంతమంది సిబ్బంది తమకు ఏమీ తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం, తరలింపు, అనంతర పరిణామాల్లో మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని సురేష్ వివరించినట్లు సమాచారం.
సురేష్ వెల్లడించిన వివరాల ఆధారంగా స్టేషన్ సిబ్బంది కాల్ డేటా రికార్డులను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. సిబ్బంది చెప్పిన వివరాలు వాస్తవమా, లేక తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంబంధిత వ్యక్తుల కదలికలు, ఫోన్ సంభాషణలు, ఇతర ఆధారాలను విశ్లేషిస్తున్నారు.
మరోవైపు సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించిన షరతుల సడలింపు కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై నిర్ణయం వెలువడేలోపు దర్యాప్తులో మరింత పురోగతి సాధించేందుకు సిట్ అధికారులు చర్యలు వేగవంతం చేస్తున్నారు. సురేష్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news