సర్వేపల్లి నియోజకవర్గంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముత్తుకూరులోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి దేశభక్తి స్ఫూర్తిని చాటుకున్నారు.
శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముత్తుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి బస్టాండ్ కేంద్రం వరకు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహిస్తూ దేశభక్తి నినాదాలు చేయడంతో ప్రాంతమంతా జాతీయ స్ఫూర్తితో నిండిపోయింది.
అనంతరం ముత్తుకూరు బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో సోమిరెడ్డి ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులతో స్త్రీశక్తి పథకం అమలు తీరుపై చర్చించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తమకు కలుగుతున్న ప్రయోజనాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యంపై మహిళా ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. దేశానికి స్వేచ్ఛను అందించేందుకు పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్ వంటి ఎందరో మహనీయులు దేశం కోసం పోరాడారని గుర్తుచేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు, పొనకా కనకమ్మ, బెజవాడ గోపాల్ రెడ్డి, ఆనం చెంచుసుబ్బారెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, సోమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి, ముత్తుకూరు వాసి ఈదూరు సుందరరామిరెడ్డి వంటి పలువురు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అనేక రూపాల్లో పోరాటాలు చేసి, ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల కారణంగానే దేశానికి స్వేచ్ఛ లభించిందని అన్నారు.
భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉండటం దేశ గొప్పతనానికి నిదర్శనమని సోమిరెడ్డి పేర్కొన్నారు. జనాభా పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ శాంతి, సుస్థిర అభివృద్ధికి భారత్ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దేశ సార్వభౌమత్వం, భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
అపారమైన విలువలు, గొప్ప సంస్కృతి, వైవిధ్యంతో కూడిన భారతదేశంలో జన్మించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని సోమిరెడ్డి అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిస్తూ ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news