సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో చేసిన ఓ సరదా చర్య ఫ్రెంచ్ విద్యార్థికి భారీ మూల్యం చెల్లించేలా చేసింది. సింగపూర్లో ఓ జ్యూస్ వెండింగ్ మెషీన్లోని స్ట్రాను నాకి తిరిగి అదే డిస్పెన్సర్లో పెట్టిన ఘటనపై కోర్టు అతనికి జరిమానా విధించింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యగా పరిగణించిన న్యాయస్థానం, 19 ఏళ్ల ఫ్రెంచ్ విద్యార్థి డిడియర్ గాస్పార్డ్ ఓవెన్ మాక్సిమిలియన్కు 600 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.
మాక్సిమిలియన్ సింగపూర్లో చదువుకుంటున్నాడు. అతను ఒక నారింజ రసం వెండింగ్ మెషీన్ వద్ద చేసిన చర్యను వీడియోగా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు "నగరం సురక్షితంగా లేదు" అనే అర్థం వచ్చే వ్యాఖ్యను జోడించాడు. మొదట అతనికి అది సరదాగా అనిపించినప్పటికీ, ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సింగపూర్ చట్టాల ప్రకారం ప్రజలకు ఇబ్బంది కలిగించే లేదా అసౌకర్యం సృష్టించే చర్యలను ప్రజా ఇబ్బంది నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు గరిష్టంగా 2,000 సింగపూర్ డాలర్ల వరకు జరిమానా లేదా మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్, రక్షణ న్యాయవాదులు ఇద్దరూ కూడా మాక్సిమిలియన్కు జరిమానా విధించాలని కోరారు.
కోర్టు విచారణ సందర్భంగా మాక్సిమిలియన్ తన తప్పును అంగీకరించాడు. తన చర్య వల్ల ఇంత పెద్ద సమస్య ఏర్పడుతుందని ఊహించలేదని, తన ప్రవర్తనకు చింతిస్తున్నట్లు తెలిపాడు. అతని తరఫు న్యాయవాది మాట్లాడుతూ, ఆ సమయంలో సరదాగా అనిపించిన విషయం ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీసిందో మాక్సిమిలియన్ ఇప్పుడు అర్థం చేసుకున్నాడని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news