ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుండగా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పీఐఎల్) దాఖలైంది. వాంగ్చుక్ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉందని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అవసరమైతే బలవంతంగా ఆహారం అందించే చర్యలు చేపట్టాలని పిటిషన్లో కోరారు. పిటిషన్ ప్రకారం, ఆయన ఇప్పటికే సుమారు 8.5 కిలోల బరువు కోల్పోయారని, తక్షణ వైద్య సహాయం అందించకపోతే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు
సోనం వాంగ్చుక్ జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీక్ష 18వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు మద్దతుదారులు చెబుతున్నారు.
ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. వాంగ్చుక్ను తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలని, అవసరమైతే ప్రాణరక్షణ కోసం బలవంతపు ఆహారం అందించాలని కోర్టును అభ్యర్థించారు. ఒక పౌరుడి ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని పిటిషన్లో వాదించారు
వాంగ్చుక్ ఆరోగ్య బులెటిన్ ప్రకారం, ఆయన 8.5 కిలోల బరువు కోల్పోయారు. కండరాల బలహీనత, తీవ్రమైన నీరసం, శారీరక నొప్పులతో బాధపడుతున్నట్లు పేర్కొనబడింది. ఆరోగ్య పరిస్థితి వేగంగా దిగజారుతోందని, దీక్ష కొనసాగితే ప్రాణాపాయం మరింత పెరిగే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే, తన డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు ప్రారంభించే వరకు నిరాహార దీక్షను విరమించబోనని సోనం వాంగ్చుక్ స్పష్టం చేసినట్లు ఆయన మద్దతుదారులు తెలిపారు. ప్రభుత్వం సంభాషణకు ముందుకు రావాలని ఆయన కోరుతున్నారని పేర్కొన్నారు.
ఈ అంశం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. పలు రాజకీయ నాయకులు వాంగ్చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఆయన లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం స్పందించాలని కూడా కోరుతున్నారు
Fetching videos...
Fetching latest news...
No trending news