దక్షిణ కొరియాలో పడిపోతున్న జననాల రేటును ఎదుర్కొనేందుకు ఒక బౌద్ధ ఆలయం చేపట్టిన వినూత్న కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రేమ, వివాహం, కుటుంబ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ యువతకు జీవిత భాగస్వామిని పరిచయం చేసే లక్ష్యంతో నిర్వహించిన ప్రత్యేక డేటింగ్ రిట్రీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 8వ శతాబ్దానికి చెందిన చారిత్రక డోంగ్వాసా బౌద్ధ ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 మంది యువకులు, 12 మంది యువతులు పాల్గొన్నారు. సంప్రదాయ ఆధ్యాత్మిక వాతావరణంలో పరస్పరం పరిచయం అవుతూ, భవిష్యత్తులో కుటుంబాన్ని నిర్మించే అవకాశాలను అన్వేషించేలా ఈ శిబిరాన్ని రూపొందించారు. దక్షిణ కొరియాలో ప్రపంచంలోనే అత్యల్ప జననాల రేటు నమోదవుతున్న దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పెళ్లిళ్లు ఆలస్యమవడం, వివాహాల సంఖ్య తగ్గడం, పిల్లలను కనడంపై యువత ఆసక్తి తగ్గడం వంటి కారణాలతో ప్రభుత్వం, సామాజిక సంస్థలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బౌద్ధ మఠం కూడా తనవంతు బాధ్యతగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
శిబిరం ప్రారంభంలో బౌద్ధ సన్యాసి యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, వారు కేవలం జీవిత భాగస్వామిని వెతకడానికి మాత్రమే రాలేదని, దేశ భవిష్యత్తుకు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించేందుకు వచ్చిన వారని పేర్కొన్నారు. ఒకరోజు కుటుంబాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు జన్మనివ్వడం దేశ భవిష్యత్తుకు అవసరమని ఆయన చెప్పారు. ఈ మాటలు విన్న యువత తొలుత నవ్వులు పూయించినా, అనంతరం పరస్పరం పరిచయం చేసుకునేందుకు ముందుకు వచ్చారు.
ఈ కార్యక్రమం మొత్తం సుమారు 30 గంటల పాటు కొనసాగింది. ఈ సమయంలో పాల్గొన్న యువతకు ఒకరినొకరు తెలుసుకునేలా పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. సమూహ చర్చలు, సంప్రదాయ ఆటలు, కలిసి భోజనం చేయడం, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిగత సంభాషణలకు అవకాశం కల్పించారు. సహజమైన వాతావరణంలో పరస్పర అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news