ఢిల్లీ కోర్టు 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ సహా ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. శుక్రవారం కర్కర్డూమా కోర్టులో అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్ శిక్షను ఖరారు చేశారు. ఈ తీర్పు సమయంలో కోర్టు ప్రాంగణంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
తాహిర్ హుస్సేన్, నాజిమ్, ఖాసిం, అనాస్, జావెద్‌లను ఈ కేసులో కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరికి మరణశిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. నిందితులు మార్పుకు అవకాశం లేని స్థితిలో ఉన్నారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది.
అంకిత్ శర్మ హత్య అత్యంత తీవ్రమైన నేరమని, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఘటనగా కోర్టు అభివర్ణించింది. అయితే నిందితులకు పునరావాస అవకాశం లేదని నిరూపించలేకపోవడంతో మరణశిక్షకు బదులుగా జీవిత ఖైదు విధిస్తున్నట్లు తెలిపింది.
తీర్పు అనంతరం తాహిర్ హుస్సేన్ స్పందిస్తూ హైకోర్టులో న్యాయం లభిస్తుందని వ్యాఖ్యానించారు. కోర్టు నుంచి బయటకు తీసుకెళ్తున్న సమయంలో ఉన్నత న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని తెలిపారు.
2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహం కాలువలో లభించగా, పోస్టుమార్టం నివేదికలో శరీరంపై 51 పదునైన గాయాలు ఉన్నట్లు వెల్లడైంది.
ఈ కేసులో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసిన అభియోగ పత్రంలో తాహిర్ హుస్సేన్‌పై హత్య, అల్లర్లు, అక్రమ సమూహం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి పలు అభియోగాలు నమోదు చేశారు. కోర్టు గతంలో ఆరుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించగా, ఐదుగురిని దోషులుగా తేల్చింది.
Fetching videos...
Fetching latest news...
No trending news