తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధికి సంబంధించిన 60కి పైగా కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం, మౌలిక సదుపాయాలను విస్తరించడం ప్రధాన లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
టీటీడీ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు వర్తించే ప్రత్యేక సౌకర్యాల నిబంధనల్లో మార్పులకు బోర్డు ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనలు జూలై 14 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుండగా, ఇప్పటికే విరాళాలు అందించిన దాతలకు పాత నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తుల కోసం రూ.17.84 కోట్ల వ్యయంతో 100 పడకల విశ్రాంతి గదుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శిథిలావస్థకు చేరుకున్న 12 పాత భవనాలను తొలగించి, దాతల సహకారంతో ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాలు నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది. కుమారధార–పసుపుధార డ్యామ్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది. వేద పరిరక్షణలో భాగంగా వేద పారాయణ పథకం కింద సంభావన ప్రాతిపదికన 791 మంది వేద పండితులను నియమించాలని నిర్ణయించింది.
అదేవిధంగా 2027 సంవత్సరానికి సంబంధించిన శ్రీవారి క్యాలెండర్లు, డైరీల ముద్రణకు ఆమోదం తెలిపిన బోర్డు, తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ముఖమండపంపై సాలహారం నిర్మాణానికి రూ.2.50 కోట్ల టెండర్‌కు కూడా ఆమోదం తెలిపింది. భక్తులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు, మౌలిక వసతులు అందించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని టీటీడీ పాలకమండలి వెల్లడించింది.
Fetching videos...
Fetching latest news...
No trending news