ఉక్రెయిన్ సమీపంలోని బ్లాక్ సీలో కార్గో నౌకపై జరిగిన దాడి తర్వాత గల్లంతైన ఇద్దరు భారతీయ నావికుల ఆచూకీ ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. విస్తృత స్థాయిలో గాలింపు, రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ నావికులు దీపక్ కుమార్ గుప్తా, రామచంద్రలను గుర్తించలేకపోయామని విదేశాంగ మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆగస్టు 5 వరకు అందిన సమాచారం ప్రకారం గల్లంతైన ఇద్దరు నావికుల కోసం చేపట్టిన భారీ స్థాయి గాలింపు చర్యలు ఫలించలేదని ధర్మాసనం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఉక్రెయిన్ అధికారులు, రొమేనియా మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్, రొమేనియా కోస్ట్ గార్డ్, ఇతర సహాయక రక్షణ సంస్థలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో చర్యలు కొనసాగించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదని వివరించారు.
ఇటీవల ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు విదేశాంగ మంత్రిత్వ శాఖను దౌత్య మార్గాల ద్వారా గల్లంతైన నావికుల ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 22 ఏళ్ల దీపక్ కుమార్ గుప్తా ఉక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం సమీపంలో డ్రోన్ల దాడికి గురైన ఎంవీ ఏజీఎన్ రాగ్నర్ అనే కార్గో నౌకలో పనిచేస్తున్నాడు.
బ్లాక్ సీ ప్రాంతంలో నౌకపై దాడి జరిగిన అనంతరం దీపక్ కుమార్ గుప్తాతో పాటు మరో భారతీయ నావికుడు రామచంద్ర గల్లంతయ్యారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలను సంప్రదించినప్పటికీ స్పందన రాకపోవడంతో దీపక్ సోదరుడు సందీప్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తన సోదరుడిని గుర్తించేందుకు ఉక్రెయిన్, రొమేనియాలోని భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుని గాలింపు, రక్షణ చర్యలు చేపట్టేలా విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్లో కోరారు.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని తాజా స్థితిగతుల నివేదిక సమర్పించాలని ఆదేశించింది. గల్లంతైన భారతీయ నావికుల కోసం తీసుకున్న చర్యలు, భవిష్యత్లో చేపట్టనున్న ప్రయత్నాల వివరాలను అందించాలని సూచించింది.
బ్లాక్ సీ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో నౌకల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, వారి ఆచూకీ కోసం కేంద్రం అంతర్జాతీయ సంస్థలతో కలిసి చర్యలు కొనసాగిస్తోంది. గల్లంతైన వారి కుటుంబాలు మాత్రం తమ వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news