రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గోటిపా-ముండోల్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఓ మహిళతో పాటు ఆమె కుమార్తెను హత్య చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పదునైన ఆయుధాలతో దాడి చేసి ఇద్దరినీ హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
మృతులను అమ్రీబాయి గద్రీ, ఆమె కుమార్తె లుంగా బాయిగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఇద్దరూ మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిపుణులను కూడా రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో విచారణ కొనసాగుతోంది.
ప్రాథమిక దర్యాప్తులో దోపిడీ ఉద్దేశంతోనే ఈ హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. గ్రామంలో అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి త్వరగా అరెస్టు చేసేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి పునారామ్ మాట్లాడుతూ, ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత హత్యలకు గల అసలు కారణాలు మరింత స్పష్టమవుతాయని చెప్పారు.
వల్లభ్‌నగర్ ఎమ్మెల్యే ఉదయ్‌లాల్ దాంగి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తల్లి, కుమార్తె హత్యలు అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి నిష్పక్షపాతంగా, వేగంగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేయాలని సూచించినట్లు తెలిపారు.
నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచి, దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అధికారుల ప్రకారం, విచారణ పూర్తయిన తర్వాత హత్యల వెనుక ఉన్న అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news