అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ, చైనా విద్యార్థులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. 2025లో భారతీయులు, చైనా పౌరులకు జారీ చేసిన ఎఫ్-1 విద్యార్థి వీసాల సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ తగ్గుదల అమెరికా విద్యా రంగం, ఉద్యోగ మార్కెట్, జాతీయ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.
అమెరికాలోని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ రూపొందించిన నివేదిక ప్రకారం, 2025లో మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో భారతీయులకు జారీ చేసిన ఎఫ్-1 వీసాల సంఖ్య భారీగా తగ్గింది. సాధారణంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ కాలంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ అవుతాయి.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం, అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతదేశం, చైనా విద్యార్థుల వాటా సగానికి మించి ఉంది. అమెరికాలో మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 11,77,766 ఉండగా, అందులో భారతీయ విద్యార్థులు 3,63,019 మంది, చైనా విద్యార్థులు 2,65,919 మంది ఉన్నారు. ఈ రెండు దేశాల విద్యార్థులే మొత్తం విదేశీ విద్యార్థుల్లో 53 శాతం వాటాను కలిగి ఉన్నారు.
నివేదిక ప్రకారం, 2025 మే నుంచి ఆగస్టు వరకు భారతీయులకు అమెరికా జారీ చేసిన ఎఫ్-1 వీసాల సంఖ్య 22,149గా ఉంది. ఇది 2017-19, 2021-24 మధ్య కాలంలో జారీ చేసిన సగటు సంఖ్య 55,717తో పోలిస్తే 60 శాతం తగ్గుదలగా నమోదైంది. అలాగే 2024లో భారతీయులకు జారీ చేసిన 58,694 వీసాలతో పోలిస్తే 62 శాతం తగ్గినట్లు నివేదిక పేర్కొంది.
చైనా విద్యార్థుల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. 2025 మే నుంచి ఆగస్టు మధ్య చైనా పౌరులకు 40,034 ఎఫ్-1 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. ఇది గత కాలాల్లోని సగటు 73,853 వీసాలతో పోలిస్తే 46 శాతం తగ్గుదలగా ఉంది. 2024లో జారీ చేసిన 61,075 వీసాలతో పోలిస్తే 34 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.
అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమం కూడా ఈ నివేదికలో ప్రస్తావించారు. 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాలోని లక్షలాది విదేశీ విద్యార్థుల్లో 2,94,253 మంది తమ చదువులు పూర్తి చేసి ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగాలు చేస్తున్నట్లు వివరించారు.
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో భారతీయ, చైనా విద్యార్థుల వాటా గణనీయంగా ఉందని నివేదిక పేర్కొంది. ఇందులో భారతీయులు 1,43,740 మంది, చైనా విద్యార్థులు 61,981 మంది ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత రంగాలకు సంబంధించిన స్టెమ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో కూడా భారతీయులు, చైనా విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం, 2024లో స్టెమ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు అనుమతి పొందిన 1,65,524 మంది విదేశీ విద్యార్థుల్లో 68 శాతం మంది భారతీయులు లేదా చైనా పౌరులే. ఇందులో భారతీయులు 79,331 మంది, చైనా పౌరులు 33,807 మంది ఉన్నారు.
విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల అమెరికా ఉద్యోగ మార్కెట్లోకి వచ్చే నైపుణ్య కలిగిన కార్మికుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా అమెరికా కంపెనీల్లో చేరే విదేశీ గ్రాడ్యుయేట్ల సంఖ్య తగ్గితే సాంకేతిక రంగాల్లో ప్రభావం ఉండవచ్చని తెలిపింది.
అదే సమయంలో చైనా విద్యార్థులు సున్నితమైన సాంకేతిక రంగాల్లో చదువుకోవడం వల్ల జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయని నివేదిక పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, మేధో సంపత్తి రక్షణ, గూఢచర్యం వంటి అంశాలపై గతంలో అమెరికా అధికారులు ఆందోళనలు వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించింది.
అయితే అన్ని చైనా విద్యార్థుల ఉద్దేశాలను అనుమానించలేమని నివేదిక అంగీకరించింది. విదేశీ విద్యార్థులపై విధించే పరిమితులు భద్రతా అంశాలతో పాటు అమెరికా విద్యార్థులు, ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రభావం చూపవచ్చని పేర్కొంది.
అమెరికాలో హెచ్-1బీ వీసా కార్యక్రమానికి ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలోనే అనుమతులు ఉంటాయి. అయితే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమానికి సంఖ్యాపరమైన పరిమితి లేకపోవడంతో విదేశీ ఉద్యోగుల సంఖ్య పెరిగిందని నివేదిక అభిప్రాయపడింది. 2024 నాటికి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, స్టెమ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా పనిచేస్తున్న విదేశీయుల సంఖ్య 5,05,590కు చేరిందని తెలిపింది.
ఎఫ్-1 వీసాల తగ్గుదల భవిష్యత్తులో అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థ, సాంకేతిక రంగ ఉద్యోగ మార్కెట్, అంతర్జాతీయ విద్యార్థుల ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news