పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఇటీవల తగ్గినట్లు కనిపించిన ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి పరిణామాలు, సముద్ర భద్రత, సైనిక కదలికల నేపథ్యంలో రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్‌లోని విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశాలను అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పవర్ ప్లాంట్లు, చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య చేపట్టే అంశంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
అమెరికా అధికారులు ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలపై అంతర్గతంగా చర్చించినట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లు ప్రారంభమయ్యేలోపు చర్యలు పూర్తిచేయాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించలేదు.
ఇక ఈ పరిణామాలపై ఇజ్రాయెల్‌తో కూడా అమెరికా సంప్రదింపులు జరిపినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. అయితే పూర్తి స్థాయి సైనిక చర్యలో పాల్గొనడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమను యుద్ధంలో భాగస్వామ్యం కావాలని ఎవరూ కోరలేదని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. కొందరు అధికారులు ప్రతిపాదిత దాడులను వ్యతిరేకించినప్పటికీ, ఇరాన్‌పై కఠిన వైఖరిని కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు అమెరికా తీసుకునే ఏకపక్ష చర్యలకు తాము తగిన ప్రతిస్పందన ఇస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యలు జరిగితే ప్రతిదాడి తప్పదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే, విద్యుత్ కేంద్రాలు లేదా చమురు శుద్ధి కేంద్రాలపై అమెరికా దాడులు చేపట్టాలనే అంశంపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది.
Fetching videos...
Fetching latest news...
No trending news