మధ్యప్రదేశ్‌లోని ధార్ చారిత్రక భోజ్‌శాల నుంచి దాదాపు శతాబ్దం క్రితం అదృశ్యమైన వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ విగ్రహం ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో, దాన్ని స్వదేశానికి తీసుకురావడానికి దౌత్యపరమైన, చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్రిటన్-భారత్ మధ్య అధికారిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.
భోపాల్‌లో జరగనున్న బ్రిక్స్ సంస్కృతి వర్కింగ్ గ్రూప్, సంస్కృతి మంత్రుల సమావేశానికి ముందు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. భారతీయ వారసత్వ సంపదను తిరిగి తీసుకురావడం ఈ సమావేశంలో కీలక అంశంగా ఉంటుందని తెలిపారు. చోరీకి గురైన, అక్రమంగా విదేశాలకు తరలించబడిన పురాతన వస్తువులను గుర్తించి తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి శాశ్వత సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
ధార్‌లోని భోజ్‌శాల సముదాయంలో ప్రతిష్ఠించిన వాగ్దేవి విగ్రహం తిరిగి తీసుకురావాలని మధ్యప్రదేశ్ అధికారులు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖను కోరినట్లు వివేక్ అగర్వాల్ తెలిపారు. ఈ విజ్ఞప్తి ఆధారంగా సుమారు ఏడాది క్రితం అధికారిక ప్రక్రియ ప్రారంభించామని చెప్పారు. సంబంధిత బ్రిటన్ మ్యూజియానికి కేంద్రం లేఖ పంపిందని, అదే సమయంలో లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా కూడా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
భారత పురావస్తు సంపద విదేశాల్లో అక్రమంగా ఉన్నట్లు సమాచారం అందిన ప్రతిసారి వాటిని తిరిగి తీసుకురావడానికి భారత రాయబార కార్యాలయాలు, దౌత్య మార్గాలు, పరస్పర న్యాయ సహాయ ఒప్పందాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర అధికారి వివరించారు. వాగ్దేవి విగ్రహం విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు.
భారతదేశం గత కొన్నేళ్లుగా విదేశాలకు తరలిపోయిన పురాతన వస్తువులను తిరిగి తీసుకురావడంలో గణనీయమైన పురోగతి సాధించిందని వివేక్ అగర్వాల్ తెలిపారు. 2014కు ముందు కేవలం 13 పురావస్తు వస్తువులు మాత్రమే భారత్‌కు తిరిగి వచ్చాయని, అయితే గత 12 ఏళ్లలో ఈ సంఖ్య 650కు పైగా పెరిగిందని చెప్పారు. విదేశాల్లో ఉన్న భారతీయ వారసత్వ సంపదను గుర్తించి స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఇటీవల ఆస్ట్రేలియా, అమెరికా నుంచి భగవాన్ బుద్ధుడికి సంబంధించిన అవశేషాలతో పాటు పలు ముఖ్యమైన విగ్రహాలు, పురాతన వస్తువులను భారత్‌కు తిరిగి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. తమిళనాడులోని ఓ ఆలయం నుంచి చోరీకి గురైన పురాతన విగ్రహాన్ని బ్రిటన్‌లోని ఆష్మోలియన్ మ్యూజియం నుంచి విజయవంతంగా తిరిగి తీసుకొచ్చామని చెప్పారు. అలాగే తమిళనాడుకు చెందిన మరో రెండు చోరీ విగ్రహాలను కూడా స్వదేశానికి తీసుకొచ్చి వాటి అసలు ఆలయాల్లో పునఃప్రతిష్ఠించామని వెల్లడించారు.
వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ఈ విగ్రహం భారతీయ వారసత్వంలో కీలక భాగమని పేర్కొంది.
ధార్‌లోని భోజ్‌శాల చరిత్రాత్మక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అక్కడి నుంచి అదృశ్యమైన వాగ్దేవి విగ్రహం తిరిగి వస్తే, అది భారత సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో మరో ముఖ్యమైన విజయంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. భారతీయ పురాతన సంపదను తిరిగి స్వదేశానికి తీసుకురావడంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరో కీలక అడుగుగా మారనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news