సీపీఐ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పముజుల దశరథ రామయ్య మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సౌత్ మోపూరులోని ఆయన స్వగృహంలో భౌతికకాయానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం దశరథ రామయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజా సేవకు అంకితమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దశరథ రామయ్య మరణం అత్యంత బాధాకరమని అన్నారు. చిన్న వయసులోనే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులై సీపీఐలో చేరిన ఆయన జీవితాంతం పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేశారని గుర్తు చేశారు.
94 ఏళ్ల వయస్సు వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన గొప్ప నాయకుడిగా దశరథ రామయ్యను కొనియాడారు. ఎవరికైనా సమస్య వస్తే అండగా నిలిచే వ్యక్తిత్వం ఆయనదని తెలిపారు. సీపీఐలో పలు బాధ్యతలు నిర్వహించడంతో పాటు సుమారు 45 ఏళ్ల పాటు సౌత్ మోపూరు సర్పంచిగా గ్రామ అభివృద్ధికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ దశరథ రామయ్య మృతి ఆయన కుటుంబ సభ్యులతో పాటు కమ్యూనిస్టు వర్గాలకు తీరని లోటని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీపీఐ జాతీయ నాయకులు నారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. దశరథ రామయ్య సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news