ప్రపంచవ్యాప్తంగా నకిలీ విలాసవంతమైన వస్తువుల తయారీ, విక్రయాలకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచిన వియత్నాం ఇప్పుడు ఆ అక్రమ వ్యాపారంపై కఠిన చర్యలు ప్రారంభించింది. అంతర్జాతీయ ఒత్తిడి, మేధోసంపత్తి హక్కుల పరిరక్షణ అవసరం, దేశ ప్రతిష్ఠను కాపాడాలనే లక్ష్యాలతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహిస్తోంది. నకిలీ బ్రాండ్ ఉత్పత్తులు, ఆన్లైన్ పైరసీ, ట్రేడ్మార్క్ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ప్రత్యేక దాడులు చేపట్టి అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో హో చి మిన్ నగర శివార్లలోని రెండు గిడ్డంగులపై పోలీసులు నిర్వహించిన దాడిలో వేల సంఖ్యలో నకిలీ చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల పేర్లు, లోగోలు ముద్రించిన ఇరవై మూడు వేలకుపైగా చెప్పులు అక్కడ నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆ బ్రాండ్ సంస్థలకు ఆ వస్తువులతో ఎలాంటి సంబంధం లేదని విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ కోట్ల రూపాయలకు సమానమని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అక్రమ నకిలీ వస్తువుల వ్యాపారానికి ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచింది.
హో చి మిన్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇప్పటికీ నకిలీ విలాస వస్తువుల విక్రయాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. విదేశాల్లో అత్యంత ఖరీదైన ధరలకు విక్రయించే ప్రముఖ బ్రాండ్ చెప్పులు, బ్యాగులు, దుస్తులు, చేతి గడియారాలు వంటి వస్తువుల నకిలీ నమూనాలు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉండటంతో పర్యాటకులు, స్థానిక వినియోగదారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. అసలైన వస్తువుల రూపాన్ని దాదాపు పూర్తిగా అనుకరించడం వల్ల సాధారణ వినియోగదారులు అసలు, నకిలీ మధ్య తేడాను గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news