ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభ దశలోనే పలు సమస్యలు వెలుగుచూస్తున్నాయి. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసే ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లు, వలసలు, మారిన చిరునామాలు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఓటర్లు కారణంగా ఫారాల పంపిణీ సజావుగా సాగడం లేదు. మరోవైపు తమకు సంబంధించిన ఫారాలు ఎక్కడ ఉన్నాయో తెలియక అనేక మంది ఓటర్లు అయోమయంలో పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో కరీంనగర్లో 1,338, పెద్దపల్లిలో 845, జగిత్యాలలో 785, రాజన్న సిరిసిల్లలో 549 పోలింగ్ బూత్లు ఉన్నాయి. వీటి పరిధిలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేస్తున్నారు. అయితే చాలాచోట్ల ఇళ్లకు తాళాలు ఉండటం, కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఉద్యోగాలు లేదా వ్యాపారాల కారణంగా అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
కొంతమంది ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించినా స్పందించకపోవడంతో అధికారులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో నమోదైన చిరునామాలకు మాత్రమే ఫారాలు వెళ్లడంతో అద్దె ఇళ్లు మారిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తమ ఫారాల గురించి తెలియకపోతున్నారు. ఫలితంగా కొంతమంది ఓటర్ల వివరాలు సరిచేసే ప్రక్రియలో ఆలస్యం ఏర్పడుతోంది.
ఎన్యుమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్ల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. ఫారాలు ఎలా నింపాలి, ఏ వివరాలు నమోదు చేయాలి అనే విషయంలో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఆన్లైన్ ద్వారా ఫారాలు నింపే అవకాశం ఉన్నప్పటికీ ఆధార్ వివరాలు, ఓటరు జాబితాలోని వివరాలు సరిపోలకపోతే వ్యవస్థ సమాచారం స్వీకరించడం లేదు. దీంతో అనేక మంది ఆన్లైన్ నమోదు పూర్తి చేయలేకపోతున్నారు.
2002 ఓటరు జాబితాలో నమోదైన వివరాలు, ప్రస్తుతం ఉన్న వివరాల మధ్య వ్యత్యాసాలు కూడా కొత్త సమస్యలకు దారి తీస్తున్నాయి. ఇంటి పేర్లు, వ్యక్తుల పేర్లు, బంధుత్వ వివరాలు, పోలింగ్ బూత్ సమాచారం వంటి అంశాల్లో అక్షర దోషాలు, నమోదు లోపాలు ఉండటంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులు, ఇంటర్నెట్ వినియోగం తెలియని వారు ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఫారాలు తీసుకున్న చాలామంది వాటిని స్వయంగా నింపకుండా బీఎల్వోలు మళ్లీ వచ్చినప్పుడు పూర్తి చేయించుకోవాలని భావిస్తున్నారు. దీంతో బీఎల్వోలపై అదనపు భారం పడుతోంది. 2002 సర్ వివరాలను ప్రతి పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంచాలని, ఓటర్లకు మరింత అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులు మాత్రం ఆధార్ లేదా ఇతర ధ్రువపత్రాల ఆధారంగా వివరాలను పరిశీలించి బీఎల్వో యాప్లో నమోదు చేస్తున్నామని చెబుతున్నారు. ఒకటి కంటే ఎక్కువసార్లు ధృవీకరణ తర్వాతే సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నామని వెల్లడిస్తున్నారు.
సర్ ప్రక్రియ పూర్తయ్యే గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో మరిన్ని సమస్యలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఓటర్లకు అవగాహన కల్పించడం, ఫారాల నింపే విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం, పాత రికార్డులను సులభంగా అందుబాటులో ఉంచడం ద్వారా మాత్రమే ఈ గందరగోళాన్ని తగ్గించగలమని నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news