రాజస్థాన్‌లో మరో పరీక్ష అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జైపుర్‌లో నిర్వహించిన పారామెడికల్ డిప్లొమా పరీక్షల్లో విద్యార్థులను కాపీయింగ్ ద్వారా పాస్ చేయించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించిన ముఠాను పోలీసులు భగ్నం చేశారు. పరీక్ష ప్రారంభానికి ముందే దాడులు నిర్వహించి పరీక్ష కేంద్రం నిర్వాహకుడు, అతని మేనల్లుడు సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
జైపుర్‌లోని ప్రభాదేవి మెమోరియల్ పీజీ కాలేజీ పరీక్ష కేంద్రంగా ఉండగా, అక్కడ భారీ స్థాయిలో కాపీయింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కేంద్రంపై దాడి చేసి కుట్రను బయటపెట్టారు. అరెస్టయిన వారిలో కాలేజీ అడ్మినిస్ట్రేటర్ రామ్కృష్ణ మండివాల్, దేవ్కృష్ణతో పాటు మరో ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉన్నారు.
దర్యాప్తులో ఝున్ఝునూ జిల్లాలోని మరో కళాశాల విద్యార్థులను పాస్ చేయించేందుకు రెండు కాలేజీల మధ్య ముందుగానే ఒప్పందం కుదిరినట్లు తేలింది. పరీక్ష హాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్ల సహాయంతో కాపీయింగ్‌కు అవకాశం కల్పించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం విద్యార్థుల నుంచి సుమారు రూ.3.5 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న రఫ్ స్లిప్‌లలో లబ్ధి పొందాల్సిన విద్యార్థుల వివరాలు కూడా లభించాయి. దీంతో ఇది ముందుగానే పథకం ప్రకారం అమలు చేయాలనుకున్న భారీ మోసమని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల సకాల చర్యతో అక్రమం అమలు కాకముందే అడ్డుకట్ట పడింది. ఘటనపై కేసు నమోదు చేసి, మరెవరైనా అధికారులు లేదా సిబ్బంది ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇటీవల ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల్లో అక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న వేళ ఈ ఘటన మరోసారి పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాజస్థాన్‌లోనే ఇటీవల నీట్ పరీక్ష లీకేజీ ఆరోపణలు వెలుగుచూడగా, ఇప్పుడు పారామెడికల్ పరీక్ష కాపీయింగ్ కుట్ర బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news