శీ
తెలంగాణకు చెందిన సంప్రదాయ హస్తకళలను ప్రపంచవ్యాప్తంగా మరింతగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని కళాకారుల ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, విమానాశ్రయాల్లో గోల్కొండ షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ బిద్రి కళాఖండాలు, ఆదిలాబాద్ ఢోక్రా కళ, పెంబర్తి ఇత్తడి వస్తువులు, చేర్యాల చిత్రాలు, నిర్మల్ పెయింటింగ్స్, వరంగల్ తివాచీలు వంటి తెలంగాణ ప్రత్యేక హస్తకళలను ప్రపంచ మార్కెట్‌కు చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది కళాకారులు వివిధ రకాల హస్తకళ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై ఉన్నారు. స్వర్ణ, రజత, కాంస్య లోహ కళాఖండాలు, చెక్క బొమ్మలు, ఎంబ్రాయిడరీ వస్త్రాలు, శిల్పాలు, తివాచీలు వంటి అనేక ఉత్పత్తులు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉత్పత్తులను ప్రస్తుతం రాష్ట్రంలోని 11 నగరాలతో పాటు ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో విక్రయిస్తున్నారు.
డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ-కామర్స్ వేదికలతో అనుసంధానం కావడం, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త డిజైన్లు రూపొందించడం, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తుల సరఫరా పెంచడం వల్ల హస్తకళల అభివృద్ధి సంస్థ లాభాల బాటలో పయనిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో హస్తకళ ఉత్పత్తుల అమ్మకాలు రూ.106.41 కోట్లకు చేరగా, 2026-27 సంవత్సరానికి రూ.143.30 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతేకాకుండా 2030 నాటికి రూ.500 కోట్ల విలువైన హస్తకళ ఉత్పత్తుల విక్రయాలను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ లక్ష్య సాధనలో భాగంగా దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో గోల్కొండ షోరూమ్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర విమానయాన శాఖ, హస్తకళల అభివృద్ధి శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖలు పంపింది. అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ ప్రత్యేక విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్నారు. దీంతో విదేశీ పర్యాటకులు, అంతర్జాతీయ కొనుగోలుదారులు తెలంగాణ కళాకృతులను నేరుగా కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది.
ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి, నల్గొండ జిల్లా దేవరకొండ, నిర్మల్, కరీంనగర్ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. అదనంగా అశ్వారావుపేట, పెంబర్తి సహా మరో పది ప్రాంతాల్లో కొత్త హస్తకళా కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
కేంద్ర హస్తకళల అభివృద్ధి శాఖ సహకారంతో కళాకారులకు ఆధునిక శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సమకాలీన డిజైన్లు రూపొందించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, నాణ్యతను పెంపొందించడం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా తెలంగాణ హస్తకళలకు మరింత విస్తృత మార్కెట్ లభించనుంది.
తెలంగాణ కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా వారి ఆదాయాన్ని పెంచడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కూడా ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. గోల్కొండ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి తెలంగాణ హస్తకళలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. విమానాశ్రయాల్లో గోల్కొండ షోరూమ్‌లు ప్రారంభమైతే తెలంగాణ కళా వైభవం ప్రపంచ పటంలో మరింత బలంగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news