వింజమూరు పట్టణం, పరిసర గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ 62వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్పీ మండల ఇన్చార్జి గోచిపాతల ఆనంద్ రావు మాదిగ ఆధ్వర్యంలో బంగ్లా సెంటర్, అశోక్ నగర్, ఊటుకూరు, తక్కెళపాడు గ్రామాల్లో కార్యక్రమాలు జరిగాయి. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు, మందకృష్ణ మాదిగ జన్మదిన కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ డీఎంహెచ్వో డాక్టర్ మాసీలామణి, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాగుతున్న సామాజిక న్యాయ ఉద్యమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో కొద్దిమందితో ప్రారంభమైన ఉద్యమం నేడు దేశవ్యాప్తంగా ప్రభావం చూపే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు.
మాదిగ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం మందకృష్ణ మాదిగ నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. ఎస్సీ జాబితాలోని 59 కులాలకు న్యాయం జరిగేలా వర్గీకరణ కోసం ఆయన చేసిన పోరాటం చారిత్రాత్మకమని కొనియాడారు. సామాజిక సమానత్వం, హక్కుల సాధన కోసం కొనసాగుతున్న ఉద్యమానికి ఆయన నాయకత్వం అందిస్తున్నారని పేర్కొన్నారు.
మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా పదో తరగతి ఉత్తీర్ణులైన ఐదుగురు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో విద్యా అభివృద్ధికి సహకారం అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. యువత విద్యావంతులై ఉన్నత స్థాయికి చేరుకోవాలని అతిథులు ఆకాంక్షించారు.
మాజీ ఎంపీటీసీ సభ్యులు రొడ్డ కొండయ్య, టీడీపీ ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు గంగపట్ల వెంగయ్య మాట్లాడుతూ, మాదిగలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సామాజిక, రాజకీయ రంగాల్లో తమ భాగస్వామ్యాన్ని పెంచుకుని హక్కుల సాధన కోసం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మొలబంటి సుధాకర్ మాదిగ, ఎంఎస్పీ మండల నాయకులు అంకి పెద్దయ్య, గంగపట్ల నాగరాజు మాదిగ, గంగపట్ల వెంగళరావు, అంకి వెంకటేష్, ఎ. నాగేష్, ఎ. శ్యాముల్, జి. జార్జీ, ఆదియ్య, కె. పెంచలరావు, పి. రాజీవ్, సీహెచ్ రాకేష్, జి. ప్రసన్న, జి. మధన్, నవీన్ కిశోర్, పవన్, జి. మహేష్, మధు, వెంగళప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news