భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం నిర్వహించనున్న మాలల మహా ర్యాలీ, సభను విజయవంతం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ పిలుపునిచ్చారు. సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ర్యాలీకి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమళ్ళ రాములు నాయకత్వంలో, జిల్లా జనరల్ సెక్రెటరీ అల్లాడి పాల్రాజ్, జిల్లా ఇన్చార్జి దామల సత్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మాలల మహా ర్యాలీ, సభ ప్రధాన ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం, రోస్టర్ విధానం వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమేనని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు.
జిల్లాలోని మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, సంఘాల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నాయకులు ఏ.వి. రావు, బైరి రవికుమార్, బండి పవన్ కుమార్, సల్వాది హృదయ, శ్రీనివాస్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే భద్రాచలం మహా ర్యాలీ, సభకు సంబంధించిన ఏర్పాట్లపై నాయకులు చర్చించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news