చిత్తూరు నియోజకవర్గంలో క్లస్టర్ స్థాయి ఇన్చార్జిల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిశీలకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పూరిమిట్ల కుమారి ఆధ్వర్యంలో 8వ క్లస్టర్‌లోని పెద్ద హరిజనవాడలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహిళలతో మమేకమైన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి వార్డులో ప్రజల సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో డాక్టర్ పూరిమిట్ల కుమారి మాట్లాడుతూ, మహిళా సాధికారతను కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో చూపించిన పార్టీగా టీడీపీ చరిత్రలో నిలిచిందని అన్నారు. మహిళలకు రాజకీయ స్వేచ్ఛ, సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయం మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతుందని తెలిపారు.
మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాకుండా ప్రజాసేవలో భాగస్వాములు కావడానికి టీడీపీ అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, తొలి మహిళా స్పీకర్ నియామకం, డ్వాక్రా సంఘాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చంద్రబాబు పాలనలోనే జరిగాయని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని డాక్టర్ పూరిమిట్ల కుమారి అన్నారు. మహిళలపై దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మహిళా నాయకులు ప్రతి వార్డులో చురుగ్గా పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి భువనేశ్వరి, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, టౌన్ మహిళా అధ్యక్షురాలు నళిని, మాధవి, టౌన్ జనరల్ సెక్రటరీ సబిత, రాణి, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news