విద్య, జ్ఞానం, కళలకు ప్రతీకగా పూజించే దేవి సరస్వతి అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆమె చేతిలో ఉండే వీణ. భారతీయ సంస్కృతిలో సరస్వతి దేవి, వీణ రెండూ విడదీయరాని బంధంగా మారాయి. అయితే చారిత్రక ఆధారాలు, శిల్పకళ, పురాతన గ్రంథాల అధ్యయనం ప్రకారం సరస్వతి దేవితో వీణకు ఉన్న ఈ అనుబంధం ఆది కాలం నుంచే లేదని, అది తరువాతి దశల్లో క్రమంగా రూపుదిద్దుకుందని పరిశోధకులు చెబుతున్నారు. నేడు సరస్వతి దేవి ప్రతిమలో అత్యంత ప్రధాన గుర్తుగా భావించే వీణ, ఆమె ఐకానోగ్రఫీలో చాలా తరువాత ప్రాముఖ్యత పొందిన చిహ్నమని చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు
వేదకాలంలో సరస్వతి ప్రధానంగా ఒక పవిత్ర నదిగా, వాక్దేవతగా, జ్ఞానానికి ప్రతీకగా ప్రస్తావించబడింది. ఋగ్వేదంలోని అనేక సూక్తుల్లో సరస్వతి గురించి ప్రస్తావన కనిపించినప్పటికీ, ఆమె చేతిలో వీణ ఉందనే వివరణ ఎక్కడా కనిపించదు. ఆ కాలంలో సరస్వతి జ్ఞానం, వాక్చాతుర్యం, పవిత్రతకు ప్రతీకగా మాత్రమే వర్ణించబడింది. సంగీత వాయిద్యమైన వీణతో ఆమెకు ప్రత్యక్ష సంబంధాన్ని సూచించే ఆధారాలు అప్పటి సాహిత్యంలో లేవు.
తరువాతి పురాణ కాలంలో సరస్వతి రూపం క్రమంగా అభివృద్ధి చెందింది. బ్రహ్మకు సహచరిగా, విద్యకు అధిష్ఠాన దేవతగా, కళలకు మూలాధారంగా ఆమెను చిత్రీకరించడం ప్రారంభమైంది. ఈ దశలో ఆమె చేతిలో పుస్తకం, జపమాల, కమలం వంటి చిహ్నాలు కనిపించాయి. అయితే వీణ ప్రతి చిత్రంలో లేదా ప్రతి శిల్పంలో తప్పనిసరిగా కనిపించేది కాదు. ప్రాంతానికొక విధంగా, కాలానికొక విధంగా సరస్వతి రూపంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
.Fetching videos...
Fetching latest news...
No trending news