నిడదవోలును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్రంలోనే నంబర్-1 నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శ్రావణ శుక్రవారం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయాన్ని, నిడదవోలు పట్టణంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి దేవస్థానాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
పూర్తి తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ పంచకట్టులో ఆలయాలకు చేరుకున్న మంత్రి దుర్గేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుడి వేషధారణలో సందడి చేసిన చిన్నారులతో మంత్రి సరదాగా ముచ్చటించారు. కోటసత్తెమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్న మహిళా భక్తులను ఆప్యాయంగా పలకరించారు. ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు మంత్రికి ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
నిడదవోలు ప్రాంతాన్ని అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో అంతర్భాగంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. పర్యాటక శాఖ ద్వారా ప్రాంతంలోని ఆధ్యాత్మిక, సహజ, జల వనరులను అనుసంధానం చేసి పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వసతి సదుపాయాల పనులు పూర్తయ్యాయని, త్వరలో వాటిని ప్రారంభిస్తామని వెల్లడించారు.
చినకాశీరేవులో ఘాట్లను ఆధునికీకరించడంతో పాటు శెట్టిపేట గోదావరి కాలువలో బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానిక ప్రజలు ఆహ్లాదంగా గడిపేలా నది పరిసరాల్లో ప్రత్యేక పార్కును, వాహనాల రాకపోకలకు అనుకూలమైన సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా నిడదవోలుకు వచ్చే పర్యాటకుల సంఖ్యను పెంచి స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.
కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కూడా మంత్రి దుర్గేష్ పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయాల అభివృద్ధితో పాటు పర్యాటక ప్రాంతాల మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా నిడదవోలుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత ద్వారా మానవాళికి కర్తవ్యాన్ని, అమూల్యమైన జ్ఞానాన్ని అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ధర్మాన్ని రక్షించి, అధర్మాన్ని నశింపజేయడమే కృష్ణ తత్వమని, శ్రీకృష్ణుడు చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఊరూరా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం సమాజంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపుతుందని మంత్రి పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి దివ్య ఆశీస్సులతో, కోటసత్తెమ్మ అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి, ప్రగతి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, కార్యనిర్వహణాధికారులు, అర్చకులు, కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news