ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్, మొరాకో మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు రిఫరీల ఎంపికపై కొత్త వివాదం మొదలైంది. ఈ మ్యాచ్‌కు అర్జెంటీనాకు చెందిన అధికారులు నియమించడంతో సోషల్ మీడియాలో, ఫుట్‌బాల్ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఫ్రాన్స్ ప్రధాన కోచ్ డిడియర్ దెషాంప్స్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశారు. తమ ప్రత్యర్థి మొరాకో మాత్రమేనని, రిఫరీలు కాదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఫ్రాన్స్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ 2026లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. కిలియన్ ఎంబాపే నేతృత్వంలోని జట్టు ఇప్పటివరకు టోర్నీలో అత్యధికంగా 14 గోల్స్ సాధించి దూసుకెళ్తోంది. మరోవైపు మొరాకో కూడా సంచలన ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 2022 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా చరిత్ర సృష్టించిన మొరాకో మరోసారి పెద్ద జట్టును ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
అయితే ఈ మ్యాచ్‌కు అర్జెంటీనా రిఫరీ బృందాన్ని నియమించడం ప్రధాన చర్చగా మారింది. ప్రధాన రిఫరీగా ఫకుండో టెల్లోతో పాటు సహాయకులు, రిజర్వ్ అధికారులు కూడా అర్జెంటీనాకు చెందిన వారే కావడంతో కొందరు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అర్జెంటీనా-ఈజిప్ట్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయాలపై వచ్చిన వివాదం కారణంగా ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 0-2 వెనుకబడిన తర్వాత అద్భుతంగా పుంజుకుని 3-2తో విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తమకు అన్యాయం చేశాయని ఈజిప్ట్ ఆటగాళ్లు, కోచ్ హొస్సామ్ హసన్ ఆరోపించారు. టోర్నమెంట్లో అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. దీంతో ఫిఫా రిఫరీల ఎంపికపై మరింత చర్చ మొదలైంది.
ఈ వివాదంపై స్పందించిన ఫ్రాన్స్ కోచ్ డిడియర్ దెషాంప్స్ మాత్రం రిఫరీలపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. “మేము ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి. నాకు రిఫరీలపై నమ్మకం ఉంది. మా ప్రత్యర్థి మొరాకో, రిఫరీ కాదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మ్యాచ్‌లో తమ దృష్టి ఆటపైనే ఉంటుందని స్పష్టం చేశారు.
అర్జెంటీనా రిఫరీలపై వచ్చిన విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ దెషాంప్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గత మ్యాచ్‌లో రిఫరీ ఎంత బాగా పనిచేశారో, మా మ్యాచ్‌లో కూడా అధికారులు అలాగే వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఫ్రాన్స్ బ్యాకప్ గోల్‌కీపర్ రాబిన్ రిస్సర్ కూడా రిఫరీల ఎంపికపై స్పందించాడు. ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య 2022 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత కొంత ఉద్రిక్తత ఉందని, అది ఆటలో భాగమేనని పేర్కొన్నారు. ఫిఫా స్థాయి పోటీల్లో పనిచేయడానికి అర్హత ఉన్నవారినే అధికారులు ఎంపిక చేస్తారని ఆయన అన్నారు.
ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య గత కొన్నేళ్లుగా ఆసక్తికర పోటీ కొనసాగుతోంది. ముఖ్యంగా 2022 వరల్డ్ కప్ ఫైనల్లో లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌ను ఓడించింది. ఆ మ్యాచ్‌లో కిలియన్ ఎంబాపే హ్యాట్రిక్ సాధించినప్పటికీ అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. దీంతో ఇరు జట్ల మధ్య పోటీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రస్తుతం ఫ్రాన్స్-మొరాకో మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టి ఉంది. ఒకవైపు ఎంబాపే, ఉస్మానే డెంబెలే, మైఖేల్ ఒలిస్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఫ్రాన్స్ బలంగా కనిపిస్తుండగా, మరోవైపు హకీమీ నేతృత్వంలోని మొరాకో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.
మొత్తానికి ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు రిఫరీల వివాదం కొత్త చర్చకు తెరలేపింది. అయితే దెషాంప్స్ మాత్రం ఈ వివాదాలను పక్కన పెట్టి ఆటపైనే దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. మ్యాచ్ ఫలితం ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడుతుందా లేదా రిఫరీ నిర్ణయాలు ప్రభావం చూపుతాయా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news