TG 20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు అద్భుతమైన పోరాటంతో ఫైనల్‌కు చేరుకుంది. మొదటి క్వాలిఫైయర్‌లో ఎదురైన ఓటమిని పాఠంగా మార్చుకున్న జట్టు.. రెండో క్వాలిఫైయర్‌లో కరీంనగర్ డైమండ్స్‌పై ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరగగా, మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
జట్టు విజయాన్ని అభినందించేందుకు ఈటీవీ డైరెక్టర్ సుజయ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, దివిజ, ట్రూజన్ సోలార్ ఫౌండర్ భవాని సురేశ్, సీఈవో శ్రీనివాస్, హెడ్ కోచ్ అనిరుధ్ తదితరులు ఆటగాళ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను అభినందిస్తూ భవిష్యత్ ఫైనల్ మ్యాచ్ కోసం మరింత ఉత్సాహంతో ఆడాలని సూచించారు.
ఈటీవీ డైరెక్టర్ సుజయ్ మాట్లాడుతూ ఓటమి అనేది ముగింపు కాదని, మరింత బలంగా తిరిగి రావడానికి అవకాశం అని అన్నారు. మొదటి క్వాలిఫైయర్‌లో ఓడినా, ఆ తప్పులను సరిదిద్దుకుని రెండో క్వాలిఫైయర్‌లో జట్టు ప్రదర్శించిన తీరు అద్భుతమని ప్రశంసించారు. ఫైనల్లో కూడా ఇదే పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఆడి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
దివిజ మాట్లాడుతూ గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస ఘర్జన కంటే ప్రమాదకరంగా ఉంటుందని చెబుతూ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తిరిగి బలంగా పుంజుకుని ఫైనల్‌కు చేరుకున్న తీరును ప్రశంసించారు. జట్టు ఆటతీరు అందరినీ ఆకట్టుకుందని తెలిపారు.
ఈ సందర్భంగా కెప్టెన్ అభిరథ్ రెడ్డికి ప్రత్యేక గౌరవం లభించింది. జట్టు విజయానికి కీలకంగా నిలిచిన అతని ప్రదర్శనను అభినందించిన ట్రూజన్ సోలార్ ఫౌండర్ భవాని సురేశ్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతకం చేసిన బ్యాట్‌ను బహుమతిగా అందించారు. సచిన్ ఆశీస్సులతో మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాలని ఆకాంక్షించారు.
అంతేకాకుండా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోఫీ అందుకున్న సమయంలో కనిపించిన ఐకానిక్ మూమెంట్‌ను గుర్తు చేస్తూ, అదే విధంగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తరఫున హెడ్ కోచ్ అనిరుధ్ చేతుల్లో ట్రోఫీ కనిపించాలని భవాని సురేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జట్టు ఫైనల్‌కు చేరిన సందర్భంగా ప్రతి ఆటగాడికి రూ.25 వేల ప్రోత్సాహక నగదు అందజేస్తామని కూడా వెల్లడించారు.
ఇక రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ విషయానికి వస్తే.. కరీంనగర్ డైమండ్స్‌పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టును హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. షణ్ముఖ అశ్విన్, ప్రణవ్ వర్మ కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. చివరి ఓవర్లలో అజయ్ దేవ్ గౌడ్ అద్భుత బౌలింగ్ చేయడంతో కరీంనగర్ జట్టు 157 పరుగులకే పరిమితమైంది.
158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, సాయివికాస్ అతడికి అద్భుత సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 124 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు.
అభిరథ్ రెడ్డి 49 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశాడు. సాయివికాస్ 45 పరుగులతో కీలక సహకారం అందించాడు. చివర్లో వైష్ణవ్ రెడ్డి 12 బంతుల్లో 25 పరుగులతో మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో అభిరథ్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు సూపర్ ఫోర్స్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ సిక్సర్స్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు అందుకున్నాడు. షణ్ముఖ అశ్విన్ గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా, వైష్ణవ్ రెడ్డి సూపర్ స్ట్రైకర్ అవార్డు అందుకున్నాడు.
మొదటి క్వాలిఫైయర్ ఓటమిని మరిచి అద్భుతంగా పుంజుకున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఇప్పుడు ఫైనల్లో ఖమ్మం ఏసెస్‌తో తలపడనుంది. టైటిల్‌ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news