తెలంగాణ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన తొలి టీజీ20 లీగ్‌కు హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో అన్విత ఖమ్మం ఏసెస్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన హైదరాబాద్, తొలి సీజన్ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. లీగ్ దశ నుంచే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్ జట్టు, ఫైనల్లోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఖమ్మం ఏసెస్‌కు హైదరాబాద్ బౌలర్లు ఆరంభం నుంచే వరుస షాకులు ఇచ్చారు. పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఖమ్మం కష్టాల్లో పడగా, హిమతేజ 31 పరుగులు, మికిల్ జైస్వాల్ 65 పరుగులతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే యశ్వీర్ గౌడ్ మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పాడు. అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా చెరో రెండు వికెట్లు సాధించడంతో ఖమ్మం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది.
158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌కు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందించారు. కెప్టెన్ అభిరథ్ రెడ్డి 30 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా షణ్ముఖ్ అశ్విన్ 36 పరుగులతో వేగంగా ఆడడంతో హైదరాబాద్ విజయపథంలో దూసుకెళ్లింది. మధ్యలో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారినప్పటికీ, వైష్ణవ్ రెడ్డి బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలుపు దిశగా నడిపించాడు. 41 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు, ప్రణవ్ వర్మతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరకు 18వ ఓవర్లో భారీ సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించడంతో హైదరాబాద్ 14 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సమష్టి కృషి, సమయోచిత ప్రదర్శనతో జట్టు తొలి టీజీ20 టైటిల్‌ను ఘనంగా సొంతం చేసుకుంది.
ఈ టోర్నీలో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ అన్ని విభాగాల్లో సమతూకమైన ఆటతీరును ప్రదర్శించి అర్హమైన ఛాంపియన్‌గా నిలిచింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు కీలక బలంగా మారగా, టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కూడా అందుకున్నాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ తొలి టీజీ20 లీగ్ తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చింది. యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అద్భుత వేదికగా నిలిచిన ఈ లీగ్ భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులను భారత క్రికెట్‌కు అందించే అవకాశాలను పెంచింది. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ సాధించిన ఈ విజయం జట్టుకే కాకుండా తెలంగాణ క్రికెట్‌కు కూడా గొప్ప మైలురాయిగా నిలిచింది. అభిమానులు కూడా ఈ చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తూ జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news